అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన. రాజధాని ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధి. దళితుడు. ఇప్పుడాయనకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయనకు టికెట్ ఇస్తే.. చందాలు వేసుకుని మరీ ఓడిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఆయనే శ్రావణ్‌కుమార్. తాడికొండ ఎమ్మెల్యే.
టీడీపీ తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కమ్మ సామాజిక వర్గ నాయకులు శ్రావణ్‌కుమార్‌కు టికెట్ దక్కకుండా అడ్డుపడుతున్నారట. మరోసారి శ్రావణ్‌కు ఛాన్స్ ఇవ్వొద్దంటూ వారు పార్టీ అగ్ర నాయకులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులను శ్రావణ్‌కుమార్ పెద్దగా లెక్క చేయకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
శ్రావణ్ తన దళిత సామాజిక వర్గ ప్రజల కోసమే పని చేస్తున్నారని, తమ గురించి పట్టించుకున్న పాపాన పోలేదనేది కమ్మ సామాజిక వర్గ నాయకుల ఆరోపణ. శ్రావణ్‌కుమార్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నాయకుల వర్గానికి గుంటూరు జెడ్పీ వైస్ ఛైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు నేతృత్వం వహిస్తున్నారు. తాము చెప్పినట్టు శ్రావణ్ కుమార్ వినట్లేదని, ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటున్నారని అసంతృప్త నాయకుల వాదన.
ఈ సారి ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌కు బదులుగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన మాజీమంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని సూచిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ మంచి పట్టు ఉందని, ఆయనకే టికెట్ ఇవ్వాలని టీడీపీలో కమ్మ సామాజిక వర్గ నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు.
డొక్కాకు ఇవ్వకపోతే- మంత్రి నక్కా ఆనంద్‌బాబును ఈ స్థానం నుంచి బరిలో దింపాలని కూడా వారు పార్టీ నాయకత్వానికి సూచనప్రాయంగా వెల్లడించారట. శ్రావణ్ కుమార్‌కు పొమ్మనకుండా పొగ పెడుతున్న వారి వెనుక చంద్రబాబు హస్తం ఉందని అంటున్నారు.
తనకు నచ్చని వారిని, పార్టీ నుంచి సాగనంపడానికి చంద్రబాబు ద్వితీయ శ్రేణి నాయకులను రెచ్చగొడతారనేది విషయం అందరికీ తెలుసు. పార్టీ అధినేత చేసే ఓ చిన్న సైగ చాలు! ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చెలరేగిపోవడానికి. శ్రావణ్ వ్యవహారంలోనూ ఇదే చోటు చేసుకుని ఉంటుందని చెబుతున్నారు.
డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను పార్టీలోకి తీసుకోవడం కూడా తాడికొండ కోసమేనని సమాచారం. శ్రావణ్ కుమార్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురవుతుండటంతో ఈ సారి అభ్యర్థిని మార్చడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే- శ్రావణ్ కుమార్ ప్రతిపక్ష పార్టీ వైపు చూపులు సారించే అవకాశాలు ఉన్నాయి.