అయితే కేంద్రంలో అధికారంలో ఉండి రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వెళుతున్నా కనీసం స్పందించడంలేన్న వాదన టీడీపీ వినిపిస్తోంది. రాజధానిని మార్చడం అంత తేలికకాదన్న టీడీపీ వాదనకు ఏ మాత్రం సపోర్టు ఇవ్వడం లేదని గుర్రుగా ఉంది. పైగా రాజధాని తరలింపుపై అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నందన పొత్తుపై తీవ్రంగా విమర్శిస్తే పొరపచ్చాలకు అవకాశం ఉంటుందని వెనుకడుగు వస్తోంది. జనసేన-బీజేపీ పొత్తుతో రాజధాని తరలింపునకు అడ్డంకులు వస్తాయనే వాదనను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ టీడీపీతో దూరంగా ఉన్నా రాజధాని తరలింపు విషయంలో జగన్ ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయించడం శుభపరిణామమని భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ కనుక ప్రత్యేక దృష్టి పెడితే రాజధాని తరలింపు వాయిదాపడవచ్చనే విషయాన్ని కూడా టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.
భాజపా-జనసేన పొత్తుపై టీడీపీ మౌనమేల?
భాజపా- జనసేన పొత్తుపై తెలుగుదేశం పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది. ప్రస్తుతానికి మౌనంగా ఉండాలని ఆ పార్టీ సంకేతాలిస్తోంది. ప్రస్తుతానికి రాజధాని అమరావతి తరలింపు ఆందోళనను ఒంటి చేత్తో నడుపుతున్నందున దీనిని ప్రాధాన్యాంశంగా భావించడంలేదు. ఎంతో కాలంగా అక్కడి గ్రామాల ఆందోళనతో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా రాజధాని తరలింపుపై వ్యతిరేకంగా ఆందోళనలు జరిగేలా పార్టీలోని ఒక వర్గం పర్యవేక్షిస్తోంది. మాజీ సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులుగా కూడా రాజధాని తరలింపు జీవన్మరణ పోరాటంగా భావిస్తూ ప్రత్యక్ష ఆందోళనలో దిగారు. ఒకరకంగా చెప్పాలంటే ఆ ఆందోళనను కనుసన్నల్లో సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పొత్తుపై వ్యాఖ్యానించడం రాజధాని రైతుల ఆందోళనను కించపరచడంగా నేతలు భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో కీలకఘట్టానికి చేరిన నేపథ్యంలో అనవసర వ్యాఖ్యానాలకు దిగకూడదనే నిర్ణయాన్ని కొనసాగిస్తోంది. పైగా రాజధాని పోరాటంలో తెలుగుదేశం వ్యూహాత్మకంగా మిగిలిన రాజకీయ పార్టీలను మద్దతు తెలిపేలా చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాజధాని గ్రామాల్లో తిరిగారు. సీఎం జగన్‌కు, మంత్రులకు కూడా రాజధాని విషయంలో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది తమ ఘనతేనంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఈ సమయంలో వారి పొత్తుపై వ్యాఖ్యలు అవసరంగా భావించడంలేదు. ఈ పొత్తు టీడీపీపై ప్రభావం ఉండదని పాలక వైసీపీకి తప్పకుండా వత్తిడి తెస్తుందని అంచనా వేస్తున్నారు.