అదుర్స్ సినిమాలో ఓ కామెడీ సన్నివేశం ఉంటుంది. ఎన్టీఆర్‌తో మూడే మూడు ముక్కలు మాట్లాడించే సీన్ అది. విలన్ రివాల్వర్ గురి పెట్టినప్పుడు కూడా `తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా..`అంటూ మూడు ముక్కలే మాట్లాడతాడు. అధికార తెలుగుదేశం పార్టీలోని కొందరు సీనియర్ల పరిస్థితి ఇప్పుడు దీనికి మించి కామెడీని పండిస్తోంది.
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో.. చంద్రబాబు నాయుడు తమ రాజకీయ ప్రత్యర్థులను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటూంటే బిక్కమొహాలు వేయడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయారు. అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే `తెలియదు, అడగలేదు, చెప్పలేదు..` అని మూడు ముక్కల్లోనే బదులిస్తున్నారు.
తమ రాజకీయ ప్రత్యర్థులు తన పార్టీలోనే చేరుతున్నారనే విషయం ఇప్పటిదాకా తనకు తెలియదని దాటవేస్తున్నారు. ఫలానా వ్యక్తి పార్టీలో చేరుతున్నారనే సమాచారం తనకు లేదని, తనను ఎవరూ అడగలేదని, పార్టీ నాయకులూ ముందుగా తనకు చెప్పలేదని నిట్టూరుస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇలాంటి సంకట స్థితినే ఎదుర్కొంటున్నారు.
కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరం ఎలాంటిదో ప్రజలకు తెలుసు. రాజకీయంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వచ్చారు. జిల్లా రాజకీయాలపై ఆధిపత్యాన్ని సాధించడానికి నిర్విరామంగా శ్రమించారు. ఓ రకంగా చెప్పాలంటే జీవితకాల పోరాటం చేశారు. ఒక్కోసారి ఒక్కో కుటుంబానికి ఆధిపత్యం దక్కుతూ వచ్చింది. రాష్ట్ర విభజన వరకూ పరస్పరం పైచేయి కోసం పావులు కదిపిన కుటుంబాలే అవి.
విభజన తరువాత ఆ అపవాదును కాంగ్రెస్ భరించాల్సి వచ్చింది. దీనితో- కోట్ల కుటుంబం ఒక్కసారిగా లూప్‌లైన్‌లో పడింది. రాష్ట్ర విభజన చోటు చేసుకున్న అనంతరం తొలి అయిదేళ్లూ కోట్ల కుటుంబం స్తబ్దుగానే ఉంది. ఇక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రాజకీయంగా ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఆ కుటుంబానికి ఉంది. అందుకే- తెలుగుదేశం వైపు ఆయన చూపులు సారించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కోట్ల కుటుంబం అండ కావాల్సిందే.
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి (కర్నూలు), బుడ్డా రాజశేఖర్ రెడ్డి (శ్రీశైలం), భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), మణిగాంధీ (కోడుమూరు), నంద్యాల ఉప ఎన్నికను పక్కన పెడితే 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ జిల్లాలో టీడీపీ గెలుచుకున్నవి మూడే.
జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలు కర్నూలు, నంద్యాలలోనూ టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వారిలో ఒకరు మంత్రి కూడా. ఇద్దరు ఎంపీలనూ టీడీపీ ఆకర్షించగలిగింది.
జిల్లాలో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయడానికి కేఈ కుటుంబం సత్తా చాలదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించారు. అందుకే దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న కేఈ కుటుంబాన్ని పక్కన పెట్టి బద్ధ విరోధి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక్కడ కామెడీ ఏమిటంటే కోట్లను పార్టీలో చేర్చుకుంటున్నట్లు కేఈ కుటుంబానికి మాట మాత్రంగా కూడా చెప్పలేదు. కనీస సమాచారమూ ఇవ్వలేదు.
ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. వయస్సు మీద పడింది. తన కోసం కాకపోయినా, వారసుల కోసమైనా ఆయన తెలుగుదేశంలోనే కొనసాగాల్సిన అవసరం కేఈ కృష్ణమూర్తికి ఉంది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానని విలేకరుల సమావేశంలో కుండబద్దలు కొట్టిన కేఈ అన్నంతపనీ చేశారా? లేదే. టీడీపీ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది.
ఇలా రాజకీయ ప్రత్యర్థులను పార్టీలో చేర్చుకుని సొంత నాయకులకే షాక్ ఇవ్వడం చంద్రబాబు కొత్తేమీ కాదు. గతంలో అనంతపురం జిల్లాలోనూ చంద్రబాబు ఇదే పాచిక విసిరారు. జేసీ దివాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు అదే జిల్లాకు చెందిన పరిటాల కుటుంబానికి ముందస్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషనూ లేదు. నంద్యాలలో భూమా కుటుంబం, జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి చేరికలు కూడా ఇదే తరహాలో కొనసాగాయి.
చంద్రగిరిలో గల్లా అరుణ కుమారి, ఆయన కుమారుడు గల్లా జయదేవ్‌ను పార్టీలో తీసుకుంటున్నారనే ముందస్తు సమాచారం చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులకు లేదు. వచ్చిన వారిని వచ్చినట్టుగా మెడలో పసుపు కండువా కప్పేశారు చంద్రబాబు. టీడీపీ నేతలు పడుతున్న ఈ దుస్థితిని చూస్తోంటే.. అదుర్స్ సినిమాలోని కామెడీ సన్నివేశాలే గుర్తుకొస్తున్నాయి.