తెలంగాణ తెలుగుదేశం పార్టీలో సీట్ల కుంపటి మొదలైంది. ఎల్బీ నగర్ నుంచి సీటు ఆశించిన సామ రంగారెడ్డి అమరావతిలో పార్టీ అధినేత చంద్ర బాబును కలిశారు. తనకు ఎల్బీనగర్ సీటు కావాలంటే పక్క నియోజకవర్గమైనా ఇబ్రహీంపట్నంను కేటాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎల్బీ నగర్ సీటు కేటాయించాలని కోరారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను నామా నాగేశ్వర్ రావుకు అప్పగించారు.
సామ రంగారెడ్డి టిడిపి పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో టిడిపిలో సామ రంగారెడ్డికి గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలో ఈ సీటు తనకే కావాలని కోరుతూ గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు వెళుతుందని, టిడిపినే పోటి చేస్తే ఆర్ కృష్ణయ్య పోటి చేస్తారని ప్రచారం జరగడంతో సామ అనుచరులు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద ఆందోళనలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో టిడిపి ప్రకటించిన సీట్లలో రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం నియోజక వర్గాన్ని ప్రకటించారు. దీంతో ఖంగుతిన్న ఆయన చంద్రబాబును కలిశారు. తనకు ఎల్బీ నగర్ లో పట్టు ఉండని ఏ మాత్రం క్యాడర్ లేని ఇబ్రహీంపట్నం కేటాయిస్తే తన పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తనకు అక్కడి కార్యకర్తలు సహకరించకపోతే తన పరిస్థితి ఏంటని వాపోయారు. దీంతో సర్దుకు పోవాలని పార్టీ సహకరిస్తుందని బాబు రంగారెడ్డికి భరోసానిచ్చారు. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను నామా నాగేశ్వరరావుకు అప్పగించారు.
ఇబ్రహీంపట్నం సీటును సామకు కేటాయించడంతో అక్కడి నేత భీంరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. తాను రెబల్ గా నామినేషన్ వేస్తానని ప్రకటించారు. ఎల్బీ నగర్ కోసం ఇబ్రహీంపట్నం సీటును కాంగ్రెస్ వదులుకుంది. మరో వైపు కృష్ణయ్య ఎల్బీ నగర్ టిడిపి సీటు రాకపోతే ఇండిపెండెంట్ గా పోటి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
సామ రంగారెడ్డి అనుచరులు అమరావతిలో ఆందోళనలు నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కూటమిలో సీట్ల సర్దుబాటు రంగారెడ్డి జిల్లాలో కాకరేపుతుంది.