టీడీపీ, జనసేన.! ఆ ఇద్దరు మాత్రమే.!

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ – జనసేన మధ్యన మాత్రమే అధికారికంగా పొత్తు నడుస్తోంది. ఇటీవల టీడీపీతో కలిసి తాము ఎన్నికలకు వెళతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారనుకోండి.. అది వేరే సంగతి.

ఇరు పార్టీల అధనేతలూ.. అంటే, పవన్ కళ్యాణ్‌తోపాటు టీడీపీ అధినేత కూడా ఒకే వేదికపైకి వచ్చి ఈ ప్రకటన ఇంకోసారి అధికారికంగా చేయాల్సి వుంది. అప్పటిదాకా పొత్తులు అధికారికంగా బీజేపీ – జనసేన మధ్యన మాత్రమే వున్నట్టు లెక్క.. అన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట.

అయితే, గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ నోటి వెంట బీజేపీ ప్రస్తావన రావడంలేదు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం, తాము జనసేనతో కలిసి పని చేస్తున్నామని అంటున్నారు. ఆ వాయిస్ కూడా ఇప్పుడు కాస్త డల్ అయ్యింది. ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఇటీవల జరిగింది. ఈ సమావేశంలో జనసేనతో పొత్తు విషయమై కొందరు నేతలు, అధినాయకత్వాన్ని వివరణ కోరాలన్నారట.

‘పొత్తుల నిర్ణయాల్ని జాతీయ నాయకత్వానికి వదిలేద్దాం. ప్రస్తుతానికైతే జనసేనతో కలిసి వెళుతున్నాం’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పార్టీ ముఖ్య నేతలతో చెప్పారట. ‘మేం, టీడీపీతో కలిసి వెళుతున్నాం. బీజేపీతో కలిసే వున్నాం. బీజేపీ కూడా, జనసేన – టీడీపీ కూటమిలో కలుస్తుందని ఆశిస్తున్నాం..’ అని జనసేనాని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ.. అన్న ఒక్క అడ్వాంటేజ్ తప్ప, బీజేపీ వల్ల జనసేనకిగానీ, టీడీపీకిగానీ.. అదనంగా ఒక్క ఓటు కూడా వచ్చే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పొత్తు పెట్టుకోవడం బీజేపీకే అవసరం.!