తెలుగుదేశం పార్టీ వైపు తిరుగుతుందా.? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ తీసుకుంటుందా.? మధ్యలో మిత్రపక్షం జనసేన పార్టీ విషయమై ఎలాంటి నిర్ణయం బీజేపీ తీసుకోబోతోంది.?
2024 ఎన్నికలకు సంబంధించి బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అన్నట్లుగా తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని, కేంద్ర బీజేపీ నాయకత్వం ప్రోత్సహిస్తోంది.
ఆ దిశగా తెలంగాణలో బీజేపీకి కొంత సానుకూల వాతావరణం కూడా ఏర్పడింది. మరి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి.? ఏపీలో వైసీపీ నుంచి బీజేపీకి పెద్దగా ఇబ్బందులేమీ లేవు. ఇప్పటికప్పుడు ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. దాంతో, వైసీపీని శతృవుగా చూడటానికి బీజేపీ కేంద్ర నాయకత్వం సంసిద్ధంగా లేదు.
అయితే, బీజేపీ మిత్రపక్షమైన జనసేన మాత్రం, వైసీపీని ‘శతృవుగా’ చూస్తోంది. జనసేనతో కలిసి వుండాలంటే, వైసీపీతో రాజకీయ పోరాటం చేయాల్సిందే. మరోపక్క, 2024 ఎన్నికల్లో ఓ నాలుగైదు అసెంబ్లీ స్థానాలైనా దక్కించుకోవడానికి టీడీపీ సాయం తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది.
టీడీపీతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొత్తు పెట్టుకుంటే, జనసేన కూడా కలిస్తే ప్రయోజనం వుంటుందన్నది బీజేపీ యోచన. అదే ప్రయోజనం వైసీపీతో గనుక కలిగితే, వైసీపీ వైపే బీజేపీ మొగ్గు చూపే అవకాశాలూ లేకపోలేదు.
