పెద్ద చిక్కే వచ్చి పడింది.! ఇలా జైలుకెళ్ళి అలా చంద్రబాబు బయటకు వచ్చేస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనుకున్నాయి. చంద్రబాబు అండ్ ‘కోర్’ టీమ్ కూడా కూడా అలాగే అనుకుని వుండొచ్చు. టీడీపీకి మిత్రపక్షంగా మారిన జనసేన పార్టీ అంచనాలు కూడా అలాగే వున్నాయేమో.!
డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది. రోజులు గడిచిపోతున్నాయ్.. వారాలూ గడిచిపోతున్నాయ్.. నెల దాటేసింది.! చంద్రబాబు జైలు నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో బయటకు రావడం కష్టంగానే కనిపిస్తోంది. అంగళ్ళు కేసులో కాస్త ఊరట లభించింది చంద్రబాబుకి. ఇంకా చాలా కేసులున్నాయ్ లైన్లో.!
ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకి ఊరట దొరికినా, మిగతా కేసుల్లో ఆయన్ని ఇరికించడానికి వైసీపీ సర్కారు, సర్వం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. పరిస్థితి చూస్తోంటే, అసలు 2024 ఎన్నికల నాటికి చంద్రబాబు, టీడీపీకి అందుబాటులో వుంటారో లేదో తెలియడంలేదని తెలుగు తమ్ముళ్ళు లోలోపల మదనపడుతున్నారు.
ఇదిలా వుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌ని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి.. అంటే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ – జనసేన కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థిగా కూర్చోబెట్టడమే బెటరని, టీడీపీలో కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. సీనియర్లే కాదు, యువ నేతలదీ అదే ఆలోచన.
కానీ, పవన్ కళ్యాణ్‌కి అంత సీన్ వుందా.? ‘నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి సిద్ధంగా వున్నాను’ అని చెప్పిన నోటితోనే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘నాకు పదవులు ముఖ్యం కాదు..’ అని అంటుంటారు.
‘నేను డబ్బులు పంచలేను..’ అని పవన్ కళ్యాణ్ చెప్పడమూ టీడీపీ శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇలాగైతే, పవన్ కళ్యాణ్‌తో కష్టమన్నది టీడీపీలో మెజార్టీ నేతల అభిప్రాయం.