టిడిపి సుజనా చౌదరికి తిండి కూడా పెట్టలేదట

టిడిపి ఎంపీ సుజనా చౌదరికి ఈడి విచారణ సమయంలో కనీసం ఆహారం కూడా ఇవ్వలేదని సుజనా చౌదరి తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. దీంతో అదే నిజమైతే మానవ హక్కులు, హూందాతనం, రాజ్యాంగ హక్కులను అతిక్రమించడం అవుతుందని ఈ విషయాన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.

అక్రమాస్తులు కలిగి ఉన్నారని, పన్నులు చెల్లించలేదనే కారణంతో సుజనా చౌదరికి సంబంధించిన ఆస్తుల పై ఈడి అధికారులు దాడి చేశారు. ఆ తర్వాత ఈడి అధికారులు సుజనా చౌదరిని మూడు రోజుల పాటు విచారించారు. తొలి రోజు ఇద్దరు ఈడి అధికారులతో కలిసి సుజనా చౌదరి భోజనం చేశారు. మరో రెండు రోజులు మాత్రం భోజనానికి అనుమతించలేదని న్యాయవాదులు తెలిపారు. ఎంపీ స్వంత భోజనాన్ని కూడా అనుమతించలేదన్నారు. సుజనా చౌదరి పై నిర్బందంగా ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించారన్నారు.

సుజనా చౌదరి తరపు న్యాయవాదులు చేసిన వాదనల పై ఈడి తరపున హజరైన న్యాయవాది తోసి పుచ్చారు. సుజనా చౌదరికి ఆహారం అందించినా ఆయన తిరస్కరించారని అరటి పళ్లు తీసుకున్నారని తెలిపారు. దీని పై ప్రమాణ పత్రం దాఖలు చేస్తామని సుజనా చౌదరి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈడి తనకిచ్చిన సమన్ల రద్దు చేయాలని సుజనా చౌదరి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డిసెంబర్ 3, 4, 5 తేదిలలో ఈడి విచారణకు సుజనా హజరయ్యారు. విచారణ 6 గంటలకు ముగిసినా 8 గంటల వరకు సుజనను బయటికి పంపించలేదని న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీకి ఆహారం అందించకపోవడం పై సమాధానమివ్వాల్సిందిగా ఈడికి హైకోర్టు ఆదేశాలిచ్చింది.