జేసి సర్జికల్ స్ట్రైక్

సర్జికల్ స్ట్రైక్ జరపటంలో సైన్యమే కాదని తాను కూడా చేయగలనని జేసి దివాకర్ రెడ్డి నిరూపించారు. ఆయన చేసిన సర్జికల్ స్ట్రైక్ దెబ్బకు ప్రత్యర్ధులకు నోటమాట రాలేదు. అనంతపురంలో కట్టిన ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి వ్యవహార శైలితో అనంతపురం టిడిపి ఎంఎల్ఏ ప్రభాకర్ చౌధరి అవమానానికి గురయ్యారు.  జరిగిన ఘటనను జాగ్రత్తగా చూస్తే ఎంపి కావాలనే ప్రభాకర్ చౌధరిని అవమానించినట్లుగా ఎవరికైనా అర్ధమైపోతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే, నగరంలోని రామ్ నగర్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ బ్రిడ్జిని ఈరోజు ప్రారంభించారు. ప్రారంభానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులను అధికారులు ఆహ్వానించారు.

ఎంఎల్ఏలు, మేయర్ తో పాటు ఎంపి అందరూ అక్కడికి చేరుకున్నారు. ముందుగా ఎంఎల్ఏ తర్వాత మేయర్ స్వరూపతో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. అందరూ జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఎంపి జేసి దివాకర్ రెడ్డి వచ్చారు. బ్రిడ్జి మీదకు చేరుకున్న జేసి నేరుగా ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన చోటు దగ్గరకు వెళ్ళారు. అక్కడి అధికారులు జాయింట్ కలెక్టర్ కూడా రానున్నట్లు జేసితో చెప్పారు.

చెప్పిన మాట వింటే ఆయన జేసి ఎందుకవుతారు ? అధికారులు చెప్పిన మాటను పక్కన పెట్టేసి బ్రిడ్జి ప్రారంభోత్సవం చేసేసి వెంటనే వెళ్ళిపోయారు. అధికారులు, ఎంఎల్ఏలు, ప్రజా ప్రతినిధులకు జేసి చేసిన పనితో షాక్ కొట్టినట్లైంది. బ్రిడ్జి ప్రారంభించి జేసి వెళ్ళిపోగానే జాయింట్ కలెక్టర్ వచ్చారు. అయితే అప్పటికే బ్రిడ్జి ప్రారంభోత్సవం అయిపోయిందిన తెలుసుకున్న ఢిల్లీ రావుకు  నోట మాట రాలేదు. ఏం మాట్లాడాలో అర్ధం కాక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు.

జరిగిన విషయాలను గమనించిన ఎంఎల్ఏ, స్వరూపాలకు జేసి తీరుపై మండిపోయింది. అయితే ఏం చేయాలో అర్ధంకాక తమ మద్దతుదారులతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఎంఎల్ఏకి ఎంపికి ఉప్పు నిప్పులాగుంది పరిస్దితి. అదే సమయంలో మేయర్ స్వరూపాకు ఎంపికి కూడా పడటం లేదు. అందుకనే కావాలనే వాళ్ళిద్దరినీ రెచ్చ గొట్టేందుకే జేసి బ్రిడ్జీని ప్రారంభించేసి వెళ్ళిపోయారు. అసలే ఇద్దరికీ పడటం లేదు. దాంతో రేపటి రోజున ఇంకెంత గొడవవుతుందేమోనని ఇతర ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ఫొటో : (ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)