రానున్న ఎన్నికల్లో తాను అసెంబ్లీ నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని అనకాపల్లి టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఆమధ్య ఒకసారి తన పోటీపై చెప్పినా పెద్ద దుమారమే రేగింది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఎంపికి బదులు భీమిలి అసెంబ్లీ స్ధానం నుండి పోటీ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇక్కడి నుండి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తుండంటం వల్ల అవంతి ప్రకటనపై అంత దుమారం రేగింది.
నిజంగానే అవంతి భీమిలీ నుండి పోటీ చేసేట్లయితే మరి గంటా పరిస్ధితేంటి ? నిజానికి ప్రతీ ఎన్నికకు నియోజకవర్గం మారిపోయే అలవాటు గంటాకుంది. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో ఇంకోసారి పోటీ చేయరు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేసేది గంటానే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేసేది ఇంకా గంటా చెప్పలేదు. కానీ ఇంతలోనే అవంతి చేసిన ప్రకటన పార్టీలో చిచ్చుపెట్టింది.
తర్వాత మళ్ళీ ఇంత కాలానికి భీమిలిలో పోటీ చేసే విషయమై అవంతి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. కాబట్టి అధిష్టానం ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయమంటే అక్కడి నుండే అసెంబ్లీకి పోటీ చేస్తానని కొత్త కథలు వినిపిస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో పోటీ చేసే విషయమై ఇప్పటికే చంద్రబాబు నుండి అవంతి హామీ తీసుకున్నట్లు జిల్లాలో ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో జిల్లా టిడిపిలో ఏదో సంచలనాలు నమోదయ్యేట్లే కనబడుతోంది.