టిడిపి ఎమ్మెల్యేల మీద చంద్రబాబు ఆగ్రహం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం శాసన సభ్యుల బాధ్యతా రాహిత్యం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలిరోజున తెలుగుదేశం పార్టీ సంప్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించడాన్ని సభ్యులు తేలికగా తీసుకోవడం మీద ఆయన విస్మయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం శాసన సభ్యుల ఒక కీలకమయిన బాధ్యతను విస్మరించారనిఆవేదన వ్యక్తం చేశారు.. పార్టీకి అసెంబ్లీ, కౌన్సిల్ లలో దాదాపు 160మంది ప్రాతినిథ్యం ఉన్నా ఈరోజు ఎన్టీరామారావు కు నివాళులర్పించేందుకు వెంకటపాలెం కు వచ్చిన వారు కేవలం 15 మంది మాత్రమే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నపుడు హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి సమాధికి నివాళులు అర్పించడం ఆనవాయితీ. అసెంబ్లీ అమరావతికి మారాక ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలనుకున్నారు. దీనికోసం రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంచుకున్నారు. తొలిరోజు నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లడం సీఎం అలవాటుగా పెట్టుకున్నారు.
అయితే ఈరోజు అసెంబ్లీకి వెళ్లే ముందు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించే సమయంలో శాసన సభ్యలు పెద్దగా కనిపించలేదు. ఇది ఆయనను ఆశ్చర్యపరిచింది.ముఖ్యమంత్రి వెంబడి ఉన్నవారు- మంత్రులు లోకేశ్‌, దేవినేని, జవహర్‌, అచ్చెన్నాయుడు- ఎమ్మెల్యేలు యామినీబాల, రాధాకృష్ణ, చాంద్‌బాషా, మాధవనాయుడు, శ్రవణ్‌కుమార్‌, గణబాబు, పీలా గోవింద్‌, మాధవవాయుడు, ఎమ్మెల్సీలు కరణం బలరాం, గౌరుగాని శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు పోతుల సునీత, టీడీ జనార్దన్‌.
ఇలా ఒక ముఖ్యమయిన సంప్రదాయాన్నివిస్మరించడం మీద ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సంస్థాపకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని ఒక టిడిపి ఎమ్మెల్యేచెప్పారు.