వీడియో: ఇన్నాళ్లూ గంజాయివ‌నంలో ఉన్నానంటోన్న ఎమ్మెల్యే

అధికార పార్టీ ఎమ్మెల్యే, పైగా విప్ కూడా. ప్ర‌తిప‌క్ష నేత సొంత జిల్లా నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు. అధికారంలో ఉన్న పార్టీని వీడి ప్ర‌తిప‌క్ష పార్టీలో చేర‌డం నిజంగా చెప్పుకోద‌గ్గ విష‌య‌మే. అది కూడా ఎన్నిక‌ల ముంగిట్లో కావ‌డం గొప్పే. ఆయ‌నే మేడా మ‌ల్లికార్జున రెడ్డి.

టీడీపీ త‌ర‌ఫున 2014 ఎన్నిక‌ల్లో రాజంపేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. `ఫిరాయింపు ఎమ్మెల్యే` జ‌య‌రాములును వ‌దిలేస్తే, క‌డ‌ప జిల్లాలో టీడీపికి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఆయ‌న‌. కొద్దిరోజులుగా చెల‌రేగుతున్న ఊహాగానాల‌కు తెర‌దించారు. తాను ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంత‌రం విలేక‌రుల‌తో మాట్లాడారు.

ఈ నెల 31న తాను వైఎస్ఆర్ సీపీలో చేర‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇన్ని రోజులూ తాను గంజాయివ‌నంలో బ‌తికాన‌ని, ఇప్పుడు తుల‌సీవ‌నం వంటి వైఎస్ఆర్ సీపీలో చేర‌బోతున్నాన‌ని అన్నారు. ప‌ద‌వులు ఆశించి తాను పార్టీని ఫిరాయించ‌ట్లేద‌ని చెప్పారు. జ‌గ‌న్ త‌న‌కు ఏ ప‌ద‌వి ఇచ్చినా ఫ‌ర్లేద‌ని చెప్పారు. ప్రజాస్వామ్య విలువ ఉన్న‌ జగన్‌ లాంటి మంచి వ్యక్తి వద్దకు రావడం సొంతింటికి వచ్చినంత సంతోషంగా ఉందన్నారు.