2019లో వైసిపి అధికారం చేపట్టినప్పటినుండి టిడిపి నుండి చాలామంది వైసీపీలో చేరుతారని ప్రచారం నిపిస్తూనే వుంది. అయితే అనుకున్నంత మంది కాకపోయినా ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ ప్రత్యక్షంగా వైసీపీలో చేరకపోయినప్పటికీ పరోక్షంగా టిడిపిను విభేదించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి తమ మద్దతు ప్రకటించారు. టిడిపి గత ఎన్నికల్లో విశాఖ సిటీ లోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. అప్పటినుండి ఒక వెలగపూడి రామకృష్ణ తప్ప మిగతా ముగ్గురూ వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మధ్యనే వాసుపల్లి గణేష్ వైసీపీకి మద్దతు ప్రకటించారు. గంటా శ్రీనివాస రావు ఆగస్టు 15న వైసిపి చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ అది జరగలేదు. దీనికి ప్రధానమైన కారణం స్థానిక మంత్రి అవంతి శ్రీనివాస్ గంటా శ్రీనివాస్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విజయసాయిరెడ్డిని కూడా మంత్రి ప్రభావితం చేసి ఆ మేరకు గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరడాన్ని ఆపేశారట.
ఇక విశాఖ లో మిగిలింది విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తాను నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని, ఈసారన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారట. అయితే అనూహ్యంగా పార్టీ ఓడిపోవడం ప్రతిపక్షంలో నిలవడంతో అది సాధ్యపడకపోవచ్చు. అందుకే వైసీపీలో చేరాలని తనకు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న తన ప్రత్యర్థి విజయేంద్రప్రసాద్ గట్టి నాయకుడు కావడంతో తాను వైసీపీలో చేరిన తనకు స్థానిక నాయకత్వం నుండి మద్దతు లభిస్తుందా లేదా అనే ఆలోచనలో ఉన్నారట. వైసిపి నేతల నుండి ఆ మేరకు హామీ వస్తే వైసీపీలో చేరాలని గణబాబు వునట్టు సన్నిహితులు చెబుతున్నారు.
గణబాబు ఆలోచనలు ఇలా ఉండగా చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జిలు ప్రకటిస్తూ, గణబాబుకు శ్రీకాకుళం, విజయనగరం పర్యవేక్షకుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. మనసులో వైసీపీలో చేరాలని ఉన్నప్పటికీ గణబాబు చంద్రబాబు చేసిన నియామకాన్ని తోసిపుచ్చకుండా ప్రస్తుతానికి స్వీకరించాలని ఉద్దేశంతో ఉన్నారట. దానికి కారణం లేకపోలేదు. ఇంకా వైసీపీ నుండి గట్టి హామీ లభించలేదు కాబట్టి ఎప్పుడైతే ఆ హామీ లభించి స్థానిక నాయకత్వం తన చేతుల్లోకి వస్తుందని గట్టిగా నమ్మకం ఏర్పడితే అప్పుడే తాను వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట.
రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నాయకులకు తన మద్దతు అవసరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడు తాను విధించిన షరతులకు వైసిపి ఒప్పుకొని తనని పార్టీ లో చేర్చుకుంటుందనే ఆలోచనలో ఉన్నారట. అందుకే ప్రస్తుతానికి చంద్రబాబు ఇచ్చిన బాధ్యతలను తీసుకుంటూ తెలుగుదేశంలో చురుగ్గా వుంటూనే వైసీపీతో చర్చలు కొనసాగించి డిసెంబర్ లో జరగబోయే ఎన్ఏడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సందర్భంగా వైసీపీలో చేరాలని గణబాబు నిర్ణయించుకున్నాడట. రాజకీయాల్లో మూడు నెలలు సమయం చాల సుదీర్ఘమైనది, అప్పటిలోపు ఏమైనా జరిగే అవకాశం వుంది.