అటు బాబు, ఇటు జగన్, అజ్ఞాతంలో తెలుగుదేశం విప్

(యనమల నాగిరెడ్డి*)

కడప జిల్లాలో రాజకీయ ప్రాబల్యం కోసం , అధికారమే పరమావధిగా రెండు ప్రధాన రాజకీయ పార్టీలు వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు రాజంపేట తెలుగుదేశం శాసనసభ్యుడు, ప్రభుత్య విప్ మేడా మల్లికార్జున రెడ్డి సొంత ఇంట్లోనే  చిచ్చు పెట్టాయి. ఫలితంగా మేడా మల్లికార్జున్ రెడ్డి వూర్లోంచి మాయమయ్యారు.

కడప జిల్లాలో 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఏకైక శాసనసభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి. భారీగా ఖర్చు పెట్టి జిల్లాలో పార్టీ అస్తిత్వాన్ని నిలిపినా తమకు న్యాయంగా ఇవ్వవలసిన గుర్తింపు పార్టీ అధినాయకత్వం ఇవ్వలేదన్న ఆక్రోశం మేడా కుటుంబసభ్యులలో గత కొన్ని సంవసత్సరాలుగా ఉంది.

పేరుకు మాత్రమే ప్రభుత్వ విప్ పదవి అని, తమ మాటకు పార్టీలోకాని, అధికారుల పరంగా కానీ ఏ మాత్రం విలువ లేదని మేడా కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పార్టీలో తమ నాయకుడి మాటకు విలువలేదని మేడా పరివారం కూడా తీవ్ర ఆవేదన వ్యక్త్యం చేస్తున్నారు. అలాగే ఇటీవల పార్టీ మారిన అది నారాయణ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇచ్చి తమను ఏమాత్రం పట్టించుకోకపోవడం, తమ పనులకు అడ్డంకులు కల్పించడం కూడా వారి అసంతృప్తికి కారణమైంది.

గతంలో వారి మాటకు వ్యతిరేకంగా జరిగిన రాజంపేట డిఎస్పీ నియామకం ఈమంటకు ఆజ్యం పోసింది.

ఈ నేపద్యంలో మేడా సోదరుడు రఘునాథరెడ్డి ప్రోద్బలంతో ఆయన వైస్సార్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. భారీ మొత్తంలో పార్టీకి నిధులు సమకూర్చడంతో పాటు, శాసన మండలి సభ్యత్వం ఇచ్చి తనకు తగిన ప్రాధాన్యం కల్పించాలని మేడా కోరారని, అందుకు జగన్మోహనరెడ్డి అంగీకరించారని అభిజ్ఞవర్గాల సమాచారం.

విఫలమైన మంత్రుల రాయబారం

 

ఈనేపథ్యంలో జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి, ఇంచార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైస్సార్ పార్టీ నాయకుడు, మేడా రాజకీయ ప్రత్యర్థి అమరనాధ్ రెడ్డిని టిడిపిలోకి తెచ్చేందుకు  విడి విడిగా జరిపిన చర్చలు జరిపారు. అవి విఫలం కావడం, మంత్రులు ఇచ్చిన అన్నిరకాల హామీలను త్రోసిపుచ్చిన అమరనాధ్ రెడ్డి పార్టీ మారడానికి ససేమిరా అనడంతో తెలుగుదేశం అధినాయకత్యం మరోసారి రంగంలోకి దిగక తప్పలేదు.

 

ముఖ్యమంత్రి బుజ్జగింపుకు లొంగిన మేడా

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సోదరుడు.

 

ఈ పరిణామాల వల్ల ముఖ్యమంత్రి  చంద్ర బాబు స్వయంగా రంగంలోకి దిగి మేడా మల్లికార్జునరెడ్డితోను, ఆయన సోదరుడు రఘునాథరెడ్డితోను ఇటీవల చర్చలు జరిపారు.  పార్టీలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించడం, వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వడం తో పాటు, భారీగా లబ్ది చేకూర్చే హామీలు ఇచ్చారని, అందువల్ల మల్లికార్జునరెడ్డి చల్లబడి పార్టీ లో కొనసాగడానికి నిర్ణయించారని మేడా వర్గీయుల సమాచారం.

అయితే ఆయన తమ్ముడు రఘునాథరెడ్డి మాత్రం టీడీపీలో కొనసాగడానికి ఏమాత్రం అంగీరించకపోగా వైస్సార్ పార్టీలో చేరాలని పట్టుపడుతున్నారని తెలిసింది.

ముఖ్యమంత్రి ఇంతకాలం తమను ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారని, గత నాలుగు సంవసత్సరాలుగా పార్టీలోనూ, అధికారుల వల్ల అనేక అవమానాలు భరించామని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పార్టీకి ఇబ్బంది కాబట్టి ముఖ్యమంత్రి బుజ్జగిస్తున్నారని, అవసరం తీరిన తర్వాత తమ బ్రతుకులు ఇంతేనని, అందువల్ల తాము ఇంకా టీడీపీలో కొనసాగడం మంచిది కాదని, పదవి లేకపోయినా గౌరవంగా చూసే పార్టీలో ఉండడం మంచిదని రఘునాథరెడ్డి గట్టిగా పట్టుపడుతున్నారని మేడా అనుయాయులు అంటున్నారు.

 

అజ్ఞాతంలో మల్లికార్జునరెడ్డి

 

అటు ముఖ్యమంత్రి మాటను కాదనలేక, తమ్ముడిని ఒప్పించలేక ఇరకాటంలో పడ్డ మల్లికార్జునరెడ్డి గత వారం రోజులుగా ఎవరికీ అందుబాటులో లేకుండా బెంగళూరు లో ఉంటున్నారని ఆయన అనుచరుల భోగట్టా.

 

కొసమెరుపు

 

ఈసారి తమ గెలుపు ఖాయమని, తమపార్టీ ప్రభుత్యం ఏర్పాటు తధ్యమని, అయినా  మేడాను పార్టీలోకి తీసుకరావడం అవసరమని జగన్ భావిస్తున్నారని, అయితే, పార్టీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమరనాధ్ రెడ్డి తదితరులు  మేడా చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం ఈ  మొత్తం ఎపిసోడ్ లో  కొసమెరుపు. ఈ పరిణామాలు మేడా కుటుంభాన్ని ఏ చేస్తాయో, రాజకీయంగా ఏ రంగు, రూపు దిద్దుకుంటాయో వేచి చూడాల్సిందే.

 

(*యనమల నాగిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు, కడప)