నాటి సువ‌ర్ణ యుగం మ‌రోసారి..!

రాజంపేటకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, విప్ మేడా మ‌ల్లికార్జున రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్రతిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం హైద‌రాబాద్‌లో ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఆయ‌న‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మేడా వెంట వ‌చ్చిన‌ వేలాది మంది కార్యకర్తలు, అనుచరులు వైఎస్ఆర్ సీపీలో చేరారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని, మళ్లీ ఆ నాటి సువర్ణ యుగం వస్తుందని భరోసా ఇచ్చారు. టీడీపీ విధానాలు నచ్చకే తాను ఆ పార్టీని వీడిన‌ట్లు మేడా చెప్పారు. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ నవరత్నాల్లాంటి పథకాలతో అందరికీ మేలు క‌లుగుతుంద‌ని అన్నారు.

కష్టపడి పనిచేసేవారికి టీడీపీలో గౌరవం లేదని అన్నారు. టీడీపీ పాలనలో జరుగుతున్న దోపిడీ అరికట్టాలంటే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ప్రజాస్వామ్య విలువలతో ముందుకెళ్లే వ్యక్తి జగన్‌ అని చెప్పారు. తాను అన్ని పదవులకు రాజీనామా చేశాన‌ని, స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి పార్టీలోకి చేరాన‌ని అన్నారు.