టిడిపిలో పొగ పెడుతున్నారు..మేడా సంచలనం

ఎంఎల్ఏ మేడాను పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయేట్లుగా పొగ పెడతున్నారా ? ఈ మాటలు ఎవరో చెబితే నమ్మాల్సిన అవసరం లేదు. స్వయంగా ఎంఎల్ఏనే చెబితే ? ఇపుదే జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే,  తెలుగుదేశంపార్టీ నుండి బయటకు వెళ్ళిపోయేట్లుగా తనకు పార్టీలోని నేతలే పొగ పెడుతున్నారంటూ జిల్లాలోని ఏకైక టిడిపి ఎంఎల్ఏ మేడా మల్లికార్జున రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నియోజవవర్గంలో జరిగిన పార్టీ సమావేశానికి ఎంఎల్ఏనే పిలివలేదు. దాంతో ఎంఎల్ఏ-ఫిరాయింపు మంత్రి మధ్య అగ్గి  రాజుకుంది.

పోయిన ఎన్నికల్లో కడప జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఒక్క రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే టిడిపి గెలిచింది. టిడిపి నుండి గెలిచిన మేడా మల్లి కార్జునరెడ్డి వ్యవహారం చాలా కాలం బాగానే నడిచింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలోనే సమస్యలు మొదలయ్యాయి. ఎప్పుడైతే ఫిరాయింపు ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి మంత్రయ్యారో అప్పటి నుండే మేడాకు సమస్యలు మొదలయ్యాయని చెప్పవచ్చు. దానికి తోడు రాబోయే ఎన్నికల్లో మేడా స్ధానంలో ఎంఎల్సీ బత్యాల చెంగల్రాయలను పోటీలోకి దింపాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు.  చంద్రబాబునాయుడు మద్దతుతోనే కొందరు నేతలు నియోజకవర్గంలో ఎంఎల్ఏకి ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

దానికితోడు ఫిరాయింపు మంత్రి ఆది నారాయణరెడ్డి కూడా బత్యాలకే ఎక్కువ వెయిట్ ఇస్తుండటం, రాజంపేట నియోజకవర్గంలోని ప్రముఖ నేతలంతా మేడాకు వ్యతిరేకం కావటం కూడా వ్యూహం ప్రకారమే జరుగుతోందనే ప్రచారం మొదలైంది. ఎప్పుడైతే  ఈ విషయం మేడా దృష్టిలో పడిందో మేడా కూడా అలర్టయ్యారు. అదే సమయంలో మేడాను వైసిపిలో చేరాలంటూ సొంత సోదరులే ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దాంతో ఏదో ఒకరోజు మేడా వైసిపిలో చేరటం ఖాయమని అర్ధమైపోతోంది.

ఈ నేపధ్యంలోనే రాజంపేటలో ఫిరాయింపు మంత్రి నిర్వహించిన పార్టీ సమావేశానికి ఎంఎల్ఎకు ఆహ్వానమే లేదు. ఆ విషయంపైనే మేడా స్పందిస్తూ తనను టిడిపిలో నుండి బలవంతంగా బయటకు పంపేయటానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు మండిపడ్డారు. పార్టీలో నుండి బయటకు పొమ్మనకుండానే తనకు పార్టీలోని కొందరు పొగ పెడుతున్నట్లు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చూడబోతే ఎక్కువ రోజులు మేడా టిడిపిలో కొనసాగేట్లు లేరు. ఎంఎల్ఏనే స్వయంగా ఆ మాట చెప్పిన తర్వాత ఏదో రోజు టిడిపి నుండి బయటకు రాక తప్పేట్లు లేదు. చూద్దాం ఆ ముచ్చట ఎప్పుడు జరుగుతుందో ?