వర్మ అరెస్టుకు టిడిపి పట్టుదలగా ఉందా ?

రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తారట రామ్ గోపాల వర్మకు ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి. లక్ష్మీస్ ఎన్టీయార్ సినిమా తీయటం ద్వారా చంద్రబాబునాయుడును అవమానిస్తున్న రామ్ గోపాల వర్మను కోర్టుకు ఈడుస్తానంటూ ఫిరాయింపు ఎంఎల్ఏ ఛాలెంజ్ చేస్తున్నారు. లీగల్ గా అయినా పర్వాలేదు ఇల్లీగల్ గా అయినా పర్వాలేదంటూ వర్మపై ఎస్వీ మండిపోతున్నారు.  వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరియించినా ఇంకా ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయని ఎస్వీ కూడా రాయలసమీ పౌరుషం గురించి మాట్లాడటమే విచిత్రంగా ఉంది.

 

ఎన్టీయార్ బయోపిక్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల వర్మ సినిమా తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  సినిమా టైటిలే లక్ష్మీస్ ఎన్టీయార్  కాబట్టి వర్మ తీస్తున్న సినిమాలో ఏముంటుందో ఎవరైనా ఊహించగలరు. ముఖ్యమంత్రి ఎన్టీయార్ ను 1995లో చంద్రబాబునాయుడు అండ్ కో వెన్నుపోటు పొడిచి దింపేశారు. ఆ తర్వాత వైశ్రాయ్ హోటల్ ముందు ఎంఎల్ఏలు ఎన్టీయార్ పైకి చెప్పులు విసిరారు. అప్పట్లో ఈ ఘటన దేశ రాజకీయాల్లోనే సంచలనం.

 

అటువంటి ఘటనలతోనే సినిమా ఉండబోతోందన్న విషయం మొన్న రిలీజ్ అయిన వెన్నుపోటు పాటతో అర్ధమవుతోంది. ఎన్టీయార్ కొడుకు నందమూరి బాలకృష్ణ కూడా మరో బయోపిక్ తీస్తున్నారు. ఈ బయోపిక్ లో చంద్రబాబు ఊసు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే, ఎన్టీయార్ రాజకీయ జీవితంలో విలన్ ఎవరైనా ఉన్నారంటే ముందు చంద్రబాబే అన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టిడిపి లబ్ది పొందాలన్న ఉద్దేశ్యంతోనే బాలకృష్ణ ఎన్టీయార్ బయోపిక్ ను తీస్తున్నారు. కాబట్టి వర్మ రిలీజ్ చేసిన వెన్నుపోటు పాటతో టిడిపి అంతా ఉలిక్కిపడింది.

 

వర్మ తీస్తున్న సినిమా కూడా కొత్త సంవత్సరంలో ఎన్నికల్లోగానే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. దాంతో సినిమా గనుక రిలీజ్ అయితే చంద్రబాబుకు, టిడిపికి ఎక్కడ బ్యాండ్ పడుతుందో అన్న భయంతో టిడిపి నేతల్లో స్పష్టంగా కనబడుతోంది. అందుకనే వర్మకు వ్యతిరేకంగా ఆందోళన చేయటమే కాకుండా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వర్మపై కేసులు పెట్టారు. అందులో భాగంగానే కర్నూలు పోలీస్టేషన్లో కూడా కేసు పెట్టారు. వర్మ అరెస్టుకు కోర్టు అనుమతి కోరితే ఇంకా అనుమతి ఇవ్వలేదట. విచిత్రంగా లేదు ఎస్వీ వాదన ? వర్మ తీయబోతున్న బయోపిక్ రాజకీయంగా చంద్రబాబును ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అన్న భయమే టిడిపిలో కనబడుతోంది. మరి ఈ వివాదాన్ని కోర్టు ఏ విధంగా పరిష్కరిస్తుందో చూద్దాం.