టీడీపీ నేత అచ్చెన్నాయుడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఎదుటి వారు ఖంగుతినాల్సిందే. తన వాక్చాతుర్యంతో అందరినీ ముప్పుతిప్పలు పెట్టే పరిస్థితి ప్రస్తుతం బాగా లేదు.
ఈఎస్ఐ స్కామ్ లో కొన్ని రోజుల కింద అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా అచ్చెన్నాయుడికి బెయిలు వచ్చింది. పలు విచారణలు చేసిన అనంతరం అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.
అచ్చెన్నాయుడిని కావాలని తప్పుడు కేసు పెట్టి ఇరికించారని టీడీపీ మొత్తుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ పార్టీపై ఎన్నో విమర్శలు చేశారు. ఏపీ సీఎం జగన్ పై కూడా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో జగన్ సర్కారు కావాలని అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టి లోపల వేయించిందని వార్తలు వచ్చాయి.
అచ్చెన్నాయుడు ఇటీవలే ఆపరేషన్ చేయించుకొని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు సడెన్ గా ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. అప్పటికే ఆయన ఆపరేషన్ చేయించుకొని ఉండటం, గాయం ఇంకా మానకపోవడంతో మళ్లీ ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి మరోసారి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆసుపత్రిలో ఉన్నప్పుడే అచ్చెన్నాయుడి కి కరోనా కూడా సోకింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న కోర్టు అచ్చెన్నాయుడికి బెయిలు మంజూరు చేసింది.
అయితే.. తాజాగా ఏసీబీ అధికారులు ఆయనపై మోపిన నేరంపై విచారణ జరిపారు. అచ్చెన్నాయుడి కి డబ్బు ముట్టినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈఎస్ఐ స్కాంలో ఆయన అవినీతి చేసినట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో.. ప్రభుత్వంపైనే విమర్శలు వచ్చాయి.
కాకపోతే.. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మాత్రం ఖజానాకు రావాల్సిన డబ్బులు రాలేదన్న విషయాన్ని అధికారులు తేల్చారు.
వైసీపీ ప్రభుత్వం కావాలని అచ్చెన్నాయుడి ని ఈ కేసులో ఇరికించిందా? అసలు నిజంగా ఈఎస్ఐలో స్కామ్ జరిగిందా? అనే విషయాలపై మాత్రం క్లారిటీ రాలేదు. వైసీపీ ప్రభుత్వం కావాలని అచ్చెన్నాయుడిని ఇరికించింది అని టీడీపీ చేసిన ఆరోపణలు నిజమే కాబోలు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చూద్దాం… అచ్చెన్నాయడు మరి దీనిపై ఎలా స్పందిస్తారో? దీనిపై క్లారిటీ ఇవ్వడానికి అచ్చెన్నాయుడు మీడియా ముందుకు వస్తారా? లేదా అనేదానిపై కూడా వేచి చూడాల్సిందే.