టీడీపీ ఎమ్మెల్యే అలక… సీఎం కార్యక్రమానికి దూరం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం తిరుమల పర్యటనలో ఉన్నారు. వేంకటేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా సీఎం తిరుమల పర్యటనకు స్థానిక ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. తిరుమలలో చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు అందించే కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ వెళ్ళలేదు.

సుగుణమ్మ

కాగా ఆమె ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆమెను తిరుమలకు పిలిపించాలని మంత్రి అమరనాధ్ రెడ్డికి సూచించారు. టీటీడీ ప్రోటోకాల్ పై సుగుణమ్మ ఆగ్రహంగా ఉన్నారు. గతంలో తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణలో పాల్గొనటానికి వెళ్లిన సుగుణమ్మ…తనకు ఆలయంలో అవమానం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహాసంప్రోక్షణలో భాగంగా నిర్వహిస్తున్న మహాశాంతి తిరుమంజనం కార్యక్రమానికి ఆమెను అనుమతించలేదు టీటీడీ అధికారులు. టీటీడీ పాలకమండలి సభ్యులకు అనుమతి ఇచ్చిన టీటీడీ అధికారులు తనకి అనుమతి ఇవ్వకపోవడంపై ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు జరిగిన ఈ అవమానాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తానంటూ హెచ్చరించింది సుగుణమ్మ అప్పట్లో. అయితే ఆమెపై టీటీడీ ప్రవర్తించిన తీరుపై ఇంకా అలక వీడని కారణంగానే సీఎం తిరుమల పర్యటనకు ఆమె దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.