ప్రతిపక్షం టీడీపీలో పరిస్థితులు అస్సలు బాగోలేవు. అక్కడ చంద్రబాబు నాయుడు మాట వైన్ నాథుడు ఒక్కడు కూడ లేడు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. ఇంకొన్నాళ్లలో పార్టీ పూర్తిగా ఖాళీ.. ఇవి ప్రస్తుతం జనంలో తెలుగుదేశం పార్టీ మీదున్న అభిప్రాయాలు, అంచనాలు. అధినేత చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి హుషారుగా లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించినట్టు జనం చెవులు కొరుక్కుంటున్నారు. జనంలో ఈ తరహా అభిప్రాయం రావడానికి అనేక కారణాలున్నాయి. టీడీపీలో పొడచూసిన పొరపొచ్ఛాలు బయట నుండి చూసిన స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు హ్యాండిచ్చి వైసీపీ పంచన చేరారు. ఇంకా ముగ్గురు నలుగురు జెండా పీకుతారనే టాక్ ఉంది. వారిలో ఇప్పటికే ఇద్దరు కన్ఫర్మ్ టికెట్లున్నారు. వీటికి తోడు ఇటీవలే ప్రకటించిన పార్లమెంటరీ నియాజకవర్గాల ఇంఛార్జుల విషయంలో కూడ తీవ్ర అసంతృప్తి చెలరేగింది. కొందరు నేతలు బాబుగారి ఎంపిక మీద నిప్పులు చెరుగుతున్నారు. జవహర్ లాంటి కొత్త ఇంఛార్జులు కొందరు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుందాం రండి అంటే తోటి లీడర్లు ఒక్కరు కూడ కన్నెత్తి చూడలేదు. పదవిలో ఉన్నవారే కావు పదవుల్లో లేని లీడర్లు కూడ పాట్టీకి బైబై చెప్పాలని భావిస్తున్నారట.
ఇక బీసీ నేతలు గొడవ మరీ ఎక్కువైంది. నాయకత్వాన్నే సందేహిస్తున్నారు వాళ్ళు. కొత్త నాయకుడు కావాల్సిందే అంటున్నారు. చాలా నియోజకవర్ట్గాల్లో నేతలు అసలు చంద్రబాబుతో టచ్లోనే లేరట. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక టీడీపీ పరిస్థితి అధోగతేనని జనం సైతం డిసైడ్ అయ్యారు. ప్రత్యర్థి వర్గాలైతే ఈ విషయాన్నీ బాకా ఊది మరీ ప్రచారం చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన టీడీపీ లీడర్లు కొందరు జనంలోకి వెళ్లి తమలో ఎలాంటి విబేధాలు లేవని, అందరం కలిసే ఉన్నామని, ఐకమత్యంతో ఉన్నామని నమ్మించే మాటలు చెబుతున్నారు. కానీ జనం మాత్రం కనిపిస్తూనే ఉందిగా మీ ఐకమత్యం అంటూ నవ్వుకుంటున్నారు.