తెలుగుదేశం తమ్ముళ్లు ఇపుడు సెల్ఫీ ఛాలెంజ్ లతో బిజీగా ఉన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా చినబాబు లోకేష్ చేపట్టిన ఈ కొత్త కార్యక్రమం తమ్ముళ్లలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అయితే… ప్రస్తుతం టీడీపీకి ఎంతో ఉపయోగపడుతుందని భావించిన ఈ సెల్ఫీ ఛాలెంజ్… చంద్రబాబు స్థాయిని తగ్గిస్తూ… ఇంత మంచి కార్యక్రమాన్ని కామెడీగా చేసేస్తుందని అంటున్నారు విశ్లేషకులు!
“అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లుగా.. ఒక వ్యూహంతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని కాస్త కామెడీ కార్యక్రమంగా మార్చేస్తున్నారు తమ్ముళ్లు. ఇదేదో వైసీపీ కార్యకర్తలు చేస్తున్నారంటే ఏదో అనుకోవచ్చు కానీ… తమ్ముళ్లే చేసేయడం బాబు & కో విచారించాల్సిన విషయం. అవును… తమ హయాంలో ఎన్నో చేశామని చెప్పుకోవడానికి సెల్ఫీలతో అభివృద్ధి చేసిన ప్రదేశాల వద్ద ఫోటోలు తీసుకుని వైసీపీకి చాలెంజి చేస్తున్నారు నారా లోకేష్. ఇదే క్రమంలో… చంద్రబాబు వెళ్లి నెల్లూరు లోని టిడ్కో కట్టడాల వద్ద సెల్ఫీ చాలెంజ్ చేశారు.
ఇంతవరకూ బాగానే ఉంది… ఈ క్రమంలో లోకేష్ చేస్తున్న ప్రతీ ఛాలెంజ్ కీ వైసీపీ నేతలు కౌంటర్స్ వేస్తున్నారు. ఇదే క్రమంలో టిడ్కో ఇళ్ల విషయంలో కూడా… “ఆ ఇళ్ళు అధికభాగం తాము కట్టి పూర్తిచేశాము” అని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఇదే క్రమంలో… తాజాగా శ్రీకాకుళంలో దశాబ్దాల కిడ్నీ సమస్యను తీర్చేలా సూపర్ స్పెషల్ ఆసుపత్రితో పాటు రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేసిన జగన్ కంటే దార్శనికుడు ఉంటారా అంటూ వైసీపీ నాయకులు కూడా సెల్ఫీ లు మొదలుపెట్టారు.
అయితే… ఈ విషయంలో తమ్ముళ్లు కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ… కాల్వ గట్టులు, అద్దె భవనాల్లో ఆఫీసులు, స్మశానాల చుట్టూ కట్టిన గోడలతో కూడా సెల్ఫీలు దిగి.. ఇది చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అంటున్నారు. దీంతో… ఆన్ లైన్ వేదికగా తమ్ముళ్లకు కౌంటర్స్ పడిపోతున్నాయి. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గురించి గొప్పగా చెప్పాలంటే… కియా షోరూం తో సెల్ఫీలు దిగడం వరకూ ఓకే కానీ… ఇలాంటి వార్డ్ మెంబర్స్ చేయించే పనులతో కూడా పబ్లిసిటీ ఏమిటని అంటున్నారు.
ఇదే క్రమంలో… హైటెక్ సిటీ సృష్టికర్త చంద్రబాబు అని ఒకనాడు చెప్పుకున్న తమ్ముళ్ళు… అరకొరగా పూర్తిచేసిన వదిలేసిన భవనాలు, అద్దే భవనాలలో మూన్నాళ్ళ ముచ్చటగా నడిపిన అన్నా క్యాంటీన్ల ను కూడా సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. అది కూడా బాబు గారి క్రెడిట్ ఖాతాలో వేస్తున్నారు. అలా బాబు కీర్తిని తామే దించేస్తున్నామన్న ఆలోచన లేకుండా తమ్ముళ్లు ముందుకు వెళ్తున్నారు.. ఫలితంగా వైసీపీ నేతలకు దొరికేస్తున్నారు.
దీంతో… సెల్ఫీ ఛాలెంజ్ లతో బాబు స్థాయిని తగ్గించేస్తున్నారని, కాస్త వెనకా ముందూ, మంచీ చెడూ, వాస్తవం అవాస్తవం చూసుకుని సెల్ఫీ లు పెట్టాలని కోరుతున్నారు టీడీపీ శ్రేయోభిలాషులు!