కొడాలికి కాన్ఫిండెన్స్ పెంచేసిన టీడీపీ నేతలు!

వైఎస్సార్ సీపీలో ఉన్న నేతల్లో కొంతమంది నేతలపై టీడీపీ చాలా గుర్రుగా ఉంటుంది. సమయం వస్తే వారిని తొక్కిపాడేయాలని భావిస్తుంటుంది. అలాంటి అవకాశం వచ్చినా కూడా టీడీపీ నేతలు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఫలితంగా… తమ స్థాయి ఇంతేనని చెప్పకనే చెబుతూ.. పార్టీ ఎంత బలహీనంగా ఉందో, కేడర్ ఎంత నీరసంగా ఉన్నారో చెప్పకనే చెప్పింది.

అవును… తాజాగా గుడివాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసే అవకాశం టీడీపీ నేతలకు ఇచ్చారు చంద్రబాబు. దీంతో… గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేతలకున్న ఆగ్రహావేశాల మేర భారీగా జనాలను తరలిస్తారని బాబు నమ్మారు. స్వచ్చందంగా జనాలు రాకపోయినా… సీట్లు ఆశిస్తున్న నేతలు, సీనియర్ నేతలూ తలోచెయ్యి వేస్తే వేల సంఖ్యలో జనాలు రావడం పక్కా అని ఫీలయ్యారు. కానీ… అలా జరగలేదు!

ఈ విషయంలో గుడివాడ సీటు ఆశిస్తున్న రాము మాత్రం… సభా ఏర్పాట్లు భారీగానే చేశారు. కానీ ఈ ఏర్పాట్లలో పడి జనసమీకరణ విషయాన్ని మరిచారు! పోనీ ఆయన సంగతి కాసేపు పక్కనపెడితే… టికెట్ కోసం పోటీపడుతున్న రావి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్చార్జి కొనకండ్ల నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులంతా వేదిక మీద కనిపించారు. వారంతా మనసుపెడితే… మూడు నాలుగు వేల మందిని తరలించడం పెద్ద విషయం కాదు! కానీ… ఆపని చేసినట్లులేరు!

కానీ… గుడివాడలో బాబు సభకు వచ్చిన జనాలు నాలుగొందల నుంచి ఐదొందల మధ్యే అనేది వాస్తవం! ఏ యాంగిల్ లో చూసినా… ఖాళీ సీట్లే దర్శనమిచ్చాయి. ఈ సభకు సంబందించి టీడీపీ పోస్ట్ చేసిన వీడియోలో సైతం జనాలను చూపించకుండా.. కెమెరా మొత్తం వేదికపై ఉన్న నేతలు, బాబు ప్రసంగాలను మాత్రమే చూపిస్తున్న వీడియోలు ప్రసారం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

గుడివాడలో కొడాలిని ధీటుగా ఎదుర్కోవాలంటే… ముందుగా టీడీపీ సభలు ఘనంగా నిర్వహించాలి. జనాలు తండోపతండ్రాలుగా వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఫలితంగా కేడర్ లో నమ్మకం పెంచాలి. కొడాలికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడొచ్చనే నమ్మకం కలిగించాలి. కానీ.. అంత సీన్ టీడీపీ నేతల్లో ఎవరికీ లేదని స్పష్టం చేశారు నేతలు. దీంతో… కొడాలి కాన్ఫిడెన్స్ మరింతగా పెరిగిపోయిందని అంటున్నారు విశ్లేషకులు.

ప్రత్యర్థి పార్టీలు పెట్టే సభలకు జనాలు భారీగా తరలివస్తే… కచ్చితంగా ఆ నాయకుడికి ఎంతో కొంత భయం కలిగేదని.. ఫలితంగా లోకల్ జనాల్లో కొంతైనా ఆలోచనలు మారేవని… కానీ, కొడాలి విషయంలో వచ్చిన అవకాశాన్ని స్థానిక టీడీపీ నేతలు చేజేతులా పాడుజేసుకున్నారని అంటున్నారు. మరి నిజంగానే జనసమీకరణ చేయలేదా… స్వచ్చందంగా జనాలొచ్చేస్తారని భావించారా… లేక, జనసమీకరణ చేసినా కూడా ఇంతే ఫలితం వచ్చిందా? టీడీపీ నేతలకే తెలియాలి!