ఏపీలో ప్రజలు అమాయకులు.. వారికేమీ తెలియదు.. మనం ఏది అచ్చేస్తే అది నిజమని నమ్మేస్తారు.. మనం ఏది ప్రసారం చేస్తే అది వాస్తవమని భావిస్తారు.. అనేది ఒక వర్గం మీడియా అభిప్రాయం. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వారిలో మార్పు ఆశించడం శూన్యం! పైగా ఇతరులకు చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అని వారు బలంగా నమ్ముతుంటారు. వారు మాట్లాడిన వీడియోలు తిరిగి చూపిస్తే… బోరుమంటారు!
విషయానికొస్తే… వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఏమిటి.. పాత్ర ఎంత.. అసలు పాత్ర ఉందా.. ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు. వీటిని పూర్తిగా నిర్ధారించాల్సింది, తీర్పు ఇవ్వాల్సింది కోర్టు! ఇది కాస్త ఇంగితం ఉన్న ఎవరికైనా తెలిసిన విషయం. పైగా ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి విజ్ఞత ఉన్నవారు అతిగా స్పందించారు. కానీ… ఈవిషయంలో ఒక వర్గం మీడియా పద్దతే వేరు.
ఈ కేసుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంపైనా, అవినాశ్ రెడ్డి పైనా, సీబీఐ పైనా.. ఆఖరికి కోర్టులపై కూడా టీవీల్లో తెగ వాగేశారు కొంతమంది నేతలు. అది విజ్ఞత కాదన్న విషయం మరిచి బరితెగించి మాట్లాడేశారు. టీవీళ్లో కూర్చుని తీర్పులు ఇచ్చేశారు.. విచారణ ఎలా జరగాలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు సూచించారు.
ఈలోపు మార్గదర్శి కేసు తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఈ పెద్ద మనుషులందరికీ చట్టం, పరిధులు గుర్తుకు వచ్చాయి. అంతే మైకుల ముందుకు వచ్చేశారు. అబ్బో… నీతి సూత్రాలు వర్ణిస్తూ లా పాయింట్లు లాగేస్తున్నారు. మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, సంస్థ ఎండీ శైలజ విషయంలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇలానే ఉంది.
అవును… మార్గదర్శి చీటింగ్ కేసులు కోర్టు విచారణలో ఉన్నపుడు ఏ1 రామోజీ, ఏ2 శైలజ తప్పుచేశారని సీఐడీ ఎలా నిర్ధారిస్తుంది? సీఐడీ ఏడీజీ సంజయ్ మార్గదర్శి శాఖలను మూసేస్తామని ఎలా చెబుతారు? మార్గదర్శి శాఖలను మూసేయాలా వద్దా అన్న విషయం తేల్చాల్సింది కోర్టే కానీ సంజయ్ ఎవరు? అసలు కోర్టు పరిధిలో ఉన్న విషయాలపై ఇలా మీడియాకు ఎక్కడం ఏమిటి? ఇవన్నీ నిన్నటిరోజున టీడీపీ నేతలు, వారి చంకనెక్కిన ఇతర పార్టీల నేతలు, రామోజీ ప్రాపకం కోసం ప్రాకులాడుతున్న నేతలు చేసిన వ్యాఖ్యలు.
పైగా ఈ విషయంలో మార్గదర్శిలో ఏ1 రామోజీ, ఏ2 శైలజ ఎలాంటి తప్పులు చేయలేదని టీడీపీ నేతలు వర్ల రామయ్య, ధూళిపాళ్ళ నరేంద్ర, వంగలపూడి అనిత మైకులముందుకు వచ్చేశారు. ఇక వారికంటే బలంగా తగుదునమ్మా అంటూ వైసీసీ పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు గొంతు చించేసుకున్నారు. మార్గదర్శి కేసులు కోర్టు విచారణలో ఉన్నప్పుడు సంజయ్ మీడియాతో ఎలా మాట్లాడతారని లాపాయింట్ లేవదీశారు. దీంతో… కీబోర్డులకు పనిచెబుతున్న నెటిజన్లు.. మరి ఇదే పాయింట్ అవినాష్ రెడ్డికి ఎందుకు వర్తించదు? అని మొదలుపెట్టారు.
వివేకానందరెడ్డి మర్డర్ కేసు కూడా కోర్టు విచారణలోనే ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డే సూత్రధారని, అవినాషే కీలక పాత్రధారని, ఇంకెప్పుడు అరెస్టు చేస్తారని, కోర్టు బెయిల్ ఇవ్వకూడదని టీవీ ల్లో కూర్చును బట్టలు చించేసుకుంటూ కొన్ని వందల సార్లు తీర్పులు ఇచ్చేశారు. ఈ క్రమంలో కోర్టులపై కూడా నోరుపారేసుకున్నారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… సీఐడీ విచారణలో రామోజీ ఏమి మాట్లాడరనే విషయం బయటకు ఎలా లీకైంది అని అడుతున్నారు టీడీపీ నేతలు. ఇది మరీ దారుణమైన ప్రశ్న. కారణం… సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి ఏమి చెప్పారు అనే విషయాలు ఎల్లో మీడియా రంగుమార్చి మరీ ఎన్నిసార్లు అచ్చేసేసింది. అలాంటప్పుడు ఈ ప్రశ్న అడిగే నైతిక హక్కు వారికి ఉందా? నేతిబీరకాయలో టైపు వారి నైతికత గురించిన సంగతి కాసేపు పక్కనపెడితే… వారికి ఎలా తెలుసో… వీరికీ అలానే తెలుసు!
ఏది ఏమైనా… ఇలాంటి అర్ధం పర్ధం లేని వాదనలు పేజీలకు పేజీలు అచ్చేసేసుకుంటున్న రామోజీ ఒక విషయాన్ని గ్రహించాలని సూచిస్తున్నారు పరిశీలకులు. కోర్టు చూసేది సంస్థ ఏర్పాటు, నిర్వహణ చట్టప్రకారం జరుగుతోందా? చందాదారుల సొమ్మును నిబంధనల ప్రకారమే ఉపయోగిస్తున్నారా.. లేక, దారి మళ్ళించారా అని మాత్రమే. దానికి సీఐడీ పొందుపరిచిన అంశాలను, మార్గదర్శి అధికారులు చెప్పిన విషయాలనూ పోల్చి చూసుకుంటుంది తప్ప… పేపర్ లో అచ్చేసిన స్టేట్ మెంట్లు కాదు!
అదే జరిగితే పసుపు పత్రికలు చూసే కోర్టులు తీర్పు ఇచ్చేపలమైతే అవినాశ్ రెడ్డికి ఈ పాటికి ఉరి పడిపోయేది. చంద్రబాబుకు బ్రతికుండగానే ఏకంగా నాలుగైదు సార్లు భారతరత్న వచ్చేసి ఉండేది.. నోబెల్ శాంతి బహుమతి వచ్చేసి ఉండేది!