మొన్నటి ఎన్నికల్లో వైసిపి గెలుపు జనాలు ఓట్లేస్తేనే సాధ్యమైందే కానీ ఈవిఎంల ట్యాంపరింగ్ జరగలేదని మాజీ ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రూ సంచలన కామెంట్ చేశారు. మొన్నటి ఎన్నికల ఫలితాలపై చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఈవిఎంల ట్యాంపరింగ్ జరిగిందని, జనాలెవరూ టిడిపికి వ్యతిరేకంగా లేరని పదే పదే చెప్పిన విషయం అందరూ చూసిందే.
రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజమన్న నెహ్రూ వైసిపికి ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతోనే అఖండ మెజారిటీ ఇచ్చారని అన్నారు. తన నియోజకవర్గంలో తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా జనాలు తనను ఓడించటానికి కారణం గ్రామస్ధాయిలో నేతల పనితీరు బావోలేకపోవటమే అన్నారు.
ప్రజలు మార్పు కోరుకున్న కారణంగానే వైసిపికి అధికారం దక్కిందన్నారు. కాబట్టి ఓటమిని పక్కనపెట్టి రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలుపుపై దృష్టి పెట్టాలని చెప్పారు. గ్రామస్ధాయి నేతల్లో ఐకమత్యం లేకపోతే భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికలో కూడా టిడిపికి గెలుపు సాధ్యం కాదన్నారు.
పనిలో పనిగా వైసిపి తరపున గెలిచిన జ్యోతుల చంటిబాబుకు నెహ్రూ అభినందనలు తెలిపారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ ఫలాలు అందించాల్సిన బాధ్యత ఎంఎల్ఏపై ఉందన్నారు. ఒకవేళ సంక్షేమ ఫలాలు అందించటంలో ఎంఎల్ఏలు విఫలమైతే జనాల్లో ఎండగట్టడం ఖాయమంటూ హెచ్చరించారు.