టిడిపి కాపు నేతల రహస్య భేటీ..కారణం అదేనా ?

రెండు రోజులుగా తెలుగుదేశంపార్టీలో ఉత్కంఠ భరితమైన రాజకీయాలు నడుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. మొదటిది ఢిల్లీ స్ధాయిలో రాజ్యసభ సభ్యులు నలుగురు బిజెపిలో చేరిపోవటం. ఇక రెండోది పార్టీలోని కాపు మాజీ ఎంఎల్ఏలు రహస్య సమావేశం జరపటం.

రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరబోతున్నారనే అనుమానాలు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లే ఆరుగురు ఎంపిల్లో నలుగురు బిజెపిలో చేరుతున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ కు లేఖ ఇవ్వటం సంచలనంగా మారింది. ఆరుగురిలో నలుగురు టిడిపి నుండి బయటకు వచ్చేయటంతో టిడిపి రాజ్యసభా పక్షం బిజెపిలో విలీనం అయిపోయినట్లే.

ఈ విషాయన్ని పక్కనపెడితే పార్టీలోని కాపు నేతలు ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారితో పాటు మాజీ ఎంఎల్ఏలు కాకినాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సుమారు 20 మంది వరకూ హాజరయ్యారు. వీరు రహస్య సమావేశం జరుపుకుంటున్న విషయం నిజంగానే రహస్యంగా ఉంచారు. సమావేశం జరిగేంత వరకూ వీళ్ళంతా సమావేశమవబోతున్న విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు.

ఓటమిపై సమీక్ష చేసుకున్నామని చెబుతున్నా అది నిజం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా తమ భవిష్యత్ రాజకీయాలపై చర్చల కోసమే వీళ్ళంతా సమావేశమైనట్లు సమావేశం. చంద్రబాబుకు వయసైపోవటం, లోకేష్ సామర్ధ్యంపై నమ్మకం లేకపోవటంతోనే వీళ్ళంతా భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారు.

టిడిపిలో ఉండటమా లేకపోతే తాము కూడా బిజెపిలోకి వెళ్ళిపోవటమా అనే పాయింట్ పైనే చర్చలు జరిగినట్లు సమాచారం. బిజెపిలోకే ఎందుకంటే వీళ్ళల్లో అత్యధికులను చేర్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడటం లేదట.