టిజి బయటపెట్టిన జనసేన-టిడిపి లోగుట్టు..సంచలనం

రెండు పార్టీలు వేసుకున్న ముసుగులు తొలగిపోతున్నాయా ? రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ, జనసేనలు కలిసే పోటీ చేస్తాయా ? ఇపుడందరిలోను అవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మార్చినెలలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు జరుగుతాయట. టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ తాజాగా చెప్పిన దాని ప్రకారం రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయట. రెండు పార్టీల మధ్య అసలు అభిప్రాయబేధాలే లేవని టిజి స్సష్టంగా చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బిఎస్పీలు కలిసి పోటీ చేస్తున్నపుడు ఏపిలో టిడిపి, జనసేనలు మాత్రం ఎందుకు కలిసి పోటీ చేయకూడదని టిజి ఎదురు ప్రశ్నిస్తున్నారు.

అసలు టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోకూడదని ఎవరన్నారో టిజి చెబితే బాగుంటుంది. చంద్రబాబు వైఖరి నచ్చకే పవన్ తనంతటా తానుగా టిడిపితో తెగతెంపులు చేసుకున్నారు. కొద్ది రోజులు చంద్రబాబునాయుడును, నారా లోకేష్ పై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తుంటారు. మరి కొద్ది రోజుల పాటు జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడుతారు. దేశం మొత్తం మీద ఒ ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని విమర్శించేది బహుశా ఏపిలోనే కాబోలు. పవన్ వైఖరి ఏ నిముషంలో ఎలాగుంటుందో అర్ధంకావటం లేదు. కాబట్టి పవన్ ఫలానా పార్టీకి మిత్రపక్షమని లేకపోతే ప్రత్యర్ధి అని అనుకునేందుకు లేదు.

ఈ నేపధ్యంలోనే రాబోయే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోమంటూ పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఒకటే గోకుతున్నారు. పవన్ కాదన్నా చంద్రబాబు మాత్రం తన గోకుడు ఆపటం లేదు. దాంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా పవన్ కూడా తన విమర్శలు, ఆరోపణలను తగ్గించేశారు. దాంతో చంద్రబాబు, పవన్ ఒకటే అనే భావన అందరిలోను ఊపందుకుంది. పవన్ పై మాట్లాడొద్దని చంద్రబాబు కూడా పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో టిజి చేసిన ప్రకటనతో రెండు పార్టీలు వేసుకున్న ముసుగు తొలగిపోయింది. మార్చిలో రెండు పార్టీలు పోటీ చేయబోయే సీట్లపై సర్దుబాటు చర్చలు జరుగుతాయని టిజి చెబుతున్నారంటే పొత్తులు ఖాయమనే అనుకోవాలి.