నూట యాభై గెలిచేస్తాం.! జనసేనకి టీడీపీ ఝలక్.!

జనసేన పార్టీతో తెలుగు దేశం పార్టీ పొత్తులో వుంది. టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి చర్చోపచర్చలు జరుగుతున్నాయ్. ఎవరూ పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించేలా మాట్లాడకూడదని ఇరు పార్టీలూ తమ శ్రేణులకు చెబుతున్నాయి.

కానీ, ఇరు వైపుల నుంచీ కూటమికి డ్యామేజీ గట్టిగానే జరుగుతోంది. అదీ, ఉన్నత స్థాయిలోనే కావడం గమనార్హం. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఈ రోజు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరుతూనే, టీడీపీకి వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు వస్తాయంటూ ప్రకటించేశారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నారోగానీ, దాన్ని యధాతథంగా సోషల్ మీడియాలో పెట్టేసింది టీడీపీ.

అంతే, జనసేన నుంచి కౌంటర్ ఎటాక్ షురూ అయ్యింది. సీట్ల పంపకాలపై స్పష్టత రాకుండానే, 150 – 25 అని ప్రకటించేయడమేంటంటూ జనసేన శ్రేణుల నుంచి కౌంటర్ ఎటాక్ గట్టిగానే టీడీపీపై పడుతోంది. ‘కూటమి 150 సీట్లు గెలుస్తుంది. వైసీపీకి ఓ పాతిక సీట్లు వదిలేస్తాం..’ అన్నది దాడి వీరభద్రరావు ఉద్దేశ్యమంటూ తెలుగు తమ్ముళ్ళు కొత్త పల్లవి అందుకుంటున్నారు. జనసేన శ్రేణులూ ఈ విషయమై కొంత మెత్తబడుతున్నట్లే కనిపిస్తోంది.

అయితే, నారా లోకేష్ ఈ మొత్తం వ్యవహారంతో ఓ క్లారిటీ వున్నారు. జనసేనతో పొత్తుని నారా లోకేష్ అంతగా ఇష్టపడటంలేదట. టీడీపీ సోషల్ మీడియా విభాగం అంతా ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్న దరిమిలా, జనసేనకు డ్యామేజ్ చేసేలానే ఆ చర్యలన్నీ వుంటున్నాయ్. ఈ విషయమై జనసైనికులు ఒకింత గుస్సా అవుతున్నారు.

అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, టీడీపీ సోషల్ మీడియా విభాగం కంట్రోల్ తప్పితే, దానికి కౌంటర్ ఎటాక్ అంతే ఘాటుగా జనసేన శ్రేణుల నుంచీ వస్తుందనీ, అది వచ్చే ఎన్నికల్లో ఓటు ట్రాన్స్‌ఫర్ విషయమై తీవ్ర ప్రభావం చూపుతుందనీ జనసేన శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.