ఏదో హడావిడి జరుగుతోంది.! కొందరికేమో ఫోన్లు వెళుతున్నాయట.! కానీ, లెక్కలు తేలడంలేదు.! టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ ఒకే రోజు రెండు సార్లు భేటీ అయ్యారట.! ప్చ్.. అయినా, చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించడంలేదు.
సంక్రాంతికే తొలి లిస్ట్ అన్నారు.. కాదు కాదు, నిజానికి చంద్రబాబు జైల్లోంచి బయటకు రాగానే లిస్ట్.. అనే ప్రచారమూ జరిగింది. అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు.! ఫిబ్రవరి రానే వచ్చేసింది.. లిస్ట్ ఎప్పుడు ఫైనల్ అవుతుంది.? అభ్యర్థులు గ్రౌండ్ లెవల్‌లో ప్రచారం ఎప్పుడు చేసుకోవాలి.?
టీడీపీ సంగతి వేరే.! జనసేన పార్టీ పరిస్థితి అలా కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన రిజల్ట్. అంతకన్నా ముందు, 2019 ఎన్నికల్లో అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే జనసేన నుంచి ఆ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడాయన కూడా జనసేనతో లేరు.
‘మా సీట్లు మాకు కన్ఫామ్ చేసేస్తే, మేం ప్రచార రంగంలో దూసుకుపోతాం..’ అని అంటున్నారు జనసేన నేతలు. ‘స్ట్రైక్ రేట్ 98 శాతం వుండాలి’ అంటూ పెద్ద మాటలు చెబుతున్న జనసేనాని, తమ పార్టీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేయడానికి పదే పదే టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరకు వెళుతున్నారాయె.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేనాని పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్నది నిర్వివాదాంశం. కానీ, జగన్‌ని దెబ్బ కొట్టాలన్న ఆలోచన తప్ప, జనసేన ఎదగాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ చేయలేకపోతున్నారు. ఇది నిజంగానే దురదృష్టకరం.!