ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కారణంగా పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్న సంగతి విదితమే. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టవుతారన్న ప్రచారం, పార్టీలో పెద్ద రచ్చకే దారి తీసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ అవినాష్ రెడ్డి అరెస్టయ్యే అవకాశం లేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. అరెస్టు చుట్టూనే వైసీపీ నానా హంగామా చేస్తోంది. ఈ అరెస్టు వ్యవహారం మీదనే టీడీపీ కూడా చాలా ఆశలు పెట్టుకుంది.
మొన్న భాస్కర్ రెడ్డి అరెస్టవడం, ఈ రోజు అవినాష్ రెడ్డి అరెస్టవుతారన్న ప్రచారం వెరసి.. టీడీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. అటు వైసీపీ, తన అనుకూల మీడియాతో ఈ కేసులో జడ్జిమెంట్లు పాస్ చేసేస్తోంటే, ఇటు టీడీపీ తన అనుకూల మీడియాతోనూ అలాంటి పనే చేస్తోంది.
అంతిమంగా కోర్టులు ఏం తేల్చుతాయన్నదే ముఖ్యం. అరెస్టయినా, అవినాష్ రెడ్డికి ఫరక్ పడదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. అది నిజం కూడా.! ఈ మాత్రందానికి టీడీపీ ఎందుకు పండగ చేసుకుంటున్నట్లు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఈ కేసు యాగీ కారణంగా, నారా లోకేష్ పాదయాత్రకు టీడీపీ సొంత మీడియాలోనే సరైన ప్రచారం దొరకడంలేదాయె.! ‘మాకు పబ్లిసిటీ రాకపోయినా ఫర్లేదు.. వైసీపీ నాశనమైపోవాలి..’ అన్నట్లు వ్యవహరిస్తోందిప్పుడు టీడీపీ. దీన్నే పైశాచికానందం అంటారేమో.!