నో మహానాడు..ఓన్లీ జయంతే..కారణం అదేనా ?

మూడు రోజుల పసుపు పండుగ మహానాడుపై ఎలక్షన్ ఎఫెక్ట్ పడింది. ఈనెల 28వ తేదీ నుండి మూడు రోజుల పాటు జరగాల్సిన మహానాడు రద్దైంది.  టిడిపి వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా మహానాడు జరపటం ఆనవాయితీగా వస్తోంది. మే 23వ తేదీన కౌంటింగ్ ఉండటంతో మహానాడు నిర్వహణకు సమయం సరిపోదన్న ఉద్దేశ్యంతో ఏకంగా రద్దే చేసేశారు. కేవలం జయంతిని మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు.

నిజానికి మూడు రోజుల మహానాడు నిర్వహణకు ఎన్నికలే ప్రధాన అడ్డంకిగా మారిందని పార్టీ వర్గాలు చెప్పాయి. 23వ తేదీన జరిగే కౌంటింగ్ లో టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం చాలామందిలో లేదు. ఒకవేళ అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్ధితేంటో చెప్పాల్సిన అవసరమే లేదు.

ఇప్పటికే టిడిపిలో నుండి వైసిపిలోకి వెళ్ళిపోవటానికి కొందరు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజంగానే వైసిపి అధికారంలోకి వస్తే టిడిపి నేతల్లో చాలామంది  పార్టీలో అయితే ఉండరు. అలాంటి పరిస్దితుల్లో మహానాడు నిర్వహిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే భయం ఉంది చాలామందిలో.

సరే ఏర్పాట్లకు సమయం సరిపోదన్నది కూడా నిజమే. మూడు రోజుల మహానాడులో వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలు వడ్డిస్తారు. మహానాడులో వంటకాలే ప్రతీసారీ హైలైట్ అవుతుంటాయన్నది వాస్తవమే. అది కాకుండా ఇంకా చాలా కమిటీలుంటాయి. అవన్నీ సక్రమంగా పనిచేయాలంటే ఇపుడున్న వారం రోజులు ఏమాత్రం సరిపోదు. అందుకనే మహానాడును వద్దని అనుకుని కేవలం జయంతిని మాత్రమే నిర్వహించాలని అనుకున్నారు.