టీడీపీ సర్వనాశనం.. టీడీపీ వల్లనే.!

ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టయిన చంద్రబాబుకి మద్దతుగా తెలంగాణలో ‘కాన్సెర్ట్’ నిర్వహించడమేంటబ్బా.? తెలంగాణలో ‘కాన్సెర్ట్’ తప్పు కాకపోవచ్చు.. కానీ, అక్కడ డాన్సులేంటి.? హంగామా ఏంటి.? పైగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదంటూ పార్టీ తీర్మానించేసుకున్నాక.

‘థాంక్యూ సీబీఎన్’ అంటూ హైద్రాబాద్ వేదికగా, టీడీపీ మద్దతుదారులు నానా హంగామా చేశారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకోపక్క, ‘జగన్ కళ్ళు తెరిపిద్దాం’ అంటూ , ‘కళ్ళకు గంతలు కట్టుకునే కార్యక్రమానికి’ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

ఒకదానితో ఒకటి అస్సలు సంబంధం లేని కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిస్తోంది. ఇంట్లో లైట్లు ఆర్పెయ్యమంటారు.. వాహనాల లైట్లను వెలిగించమంటారు. వాహనాల హార్న్‌లు కొట్టమంటారు.. అసలేం జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో.?

చంద్రబాబు జైల్లో వున్నారు గనుక, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయదట.! మరి, 2024 ఎన్నికల వరకూ చంద్రబాబుకి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఊరట రాకపోతేనో.! అప్పుడు ఏపీలో కూడా టీడీపీ పోటీ చేయబోదన్నమాట.

అసలు టీడీపీలో ఏం జరుగుతోందో టీడీపీ కార్యకర్తలకే అర్థం కావడంలేదు. ‘అధినాయకత్వం ఏవేవో పిలుపులు ఇస్తోంది.. పార్టీ మాత్రం నాశనమైపోతోంది.. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం..’ అని నిబద్ధత కలిగిన కొందరు టీడీపీ కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.

పగవాడిక్కూడా రాకూడని కష్టమిది. సమీప భవిష్యత్తులో టీడీపీ కాలగర్భంలో కలిసిపోతే, అది చంద్రబాబు స్వయంకృతాపరాధం వల్లనే.!