పవన్ కళ్యాణ్ సాయం కావాలిగానీ.!

ఎక్కువ సీట్లు అడక్కుండా పవన్ కళ్యాణ్, టీడీపీకి మద్దతిస్తే బావుంటుంది.! ఇదీ తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. టీడీపీ ఆలోచనలు ఇంతకన్నా భిన్నంగా వుంటాయని ఎలా అనుకోగలం.? ఎప్పుడైతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారో, ఆ తర్వాతి నుంచే టీడీపీ తనదైన వ్యూహాలతో ముందుకు వెళుతోంది.. పొత్తులపై.

పవన్ కళ్యాణ్ ‘పొత్తుల’ గురించి మాట్లాడటం తప్ప, టీడీపీ ఇంతవరకు పొత్తులపై ఎలాంటి సానుకూల వ్యాఖ్యలూ చేయలేదు. జనసేనతో పొత్తు పెట్టుకుంటామని చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదుట.?

ఈ విషయమై జనసైనికులు ఒకింత గుస్సా అవుతున్నారు. వాళ్ళనేమో, తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా ర్యాగింగ్ చేస్తున్నారు. టీడీపీ వర్సెస్ జనసేన.. ఈ రెండు పార్టీల మధ్యా సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న వార్ చూస్తే, అసలు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశమే లేదనిపిస్తుంది ఎవరికైనా.!

ఇదిలా వుంటే, అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్.. ఇద్దరూ సందర్భం కాకపోయినా, పవన్ కళ్యాణ్ పేరుని ఎలాగోలా పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. భీమవరం గొడవలో కావొచ్చు, ఇంకో వ్యవహారంలో కావొచ్చు.. అటు లోకేష్, ఇటు చంద్రబాబు.. స్పేస్ తీసుకుని, పవన్ కళ్యాణ్‌ని లాగుతున్నారు.

అధికార పార్టీ వేధింపులంటూ గగ్గోలు పెడుతున్న లోకేష్, తెలివిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబుదీ అదే పరిస్థితి. ఈ వాలకం చూస్తోంటే, జనసేనకు సగం సీట్లను టీడీపీ ఇచ్చేయొచ్చన్న భావన జనసైనికుల్లో కలగడం సహజమే.

కానీ, పాతిక ముప్ఫయ్ సీట్ల కంటే ఎక్కువ ఇవ్వబోం.. అని పొత్తులపై టీడీపీ శ్రేణుల ద్వారా చంద్రబాబు సంకేతాలు పంపుతుండడం కొసమెరుపు.!