బ్రేకింగ్: ఆంధ్రా నిరుద్యోగులకు నారా లోకేష్ శుభవార్త

ఆంధ్ర నిరుద్యోగులకి చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో అమలు చేయనున్న నిరుద్యోగభృతి గురించి నారా లోకేష్ ప్రకటించారు. నాలుగేళ్లలో ఏపీ లో ఐదు లక్షలా యాభైయేడువేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

ఇంటికి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నా భృతి చెల్లిస్తామని, ఒక్కొక్కరికి నెలకి వెయ్యి రూపాయల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేస్తామని చెప్పారు లోకేష్. దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా నిరుద్యోగభృతిని ఏపీలో పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. 22 నుంచి 35 ఏళ్ళ లోపు నిరుద్యోగులంతా నిరుద్యోగభృతికి అర్హులేనని అన్నారు.

అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ లో కూడా శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేసారు. అర్హులైన నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాధికార సర్వే ద్వారా రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు లోకేష్. లోటుబడ్జెట్లో కూడా ఎన్నికల హామీలను నిలబెట్టుకొంటున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు లోకేష్.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న నిరుద్యోగ భృతి విధివిధానాలఫై ప్రధానంగా చర్చ నడిచింది. అలాగే త్వరలో అమల్లోకి తీసుకురానున్న ఎలక్ట్రిక్‌ వాహనాల విధానం ముసాయిదాలో చేయాల్సిన మార్పులు, చేర్పులు గురించి మంత్రివర్గం ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.