బిజెపిలో చేరిన టిడిపి మాజీ ఎంఎల్ఏ…చంద్రబాబుకు షాక్

చంద్రబాబునాయుడు మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి షాక్ ఇచ్చారు. శుక్రవారం హఠాత్తుగా ఢిల్లీ వెళ్ళిన సూరి బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. నిజానికి సూరి బిజెపిలో చేరాల్సింది వచ్చే నెల 5వ తేదీన. కానీ ఎందుకనో బిజెపి ఢిల్లీ నేతల నుండి వచ్చిన ఫోన్ కారణంగా వెంటనే వెళ్ళి పార్టీలో చేరిపోయారు.

అనంతపురం జిల్లా ధర్మవరంలో 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా సూరి గెలిచారు. గెలిచిన దగ్గర నుండి బాగా కాంట్రవర్సీల్లోనే ఉన్నారు. అడ్డదిడ్డమైన సంపాదనకు తోడు అప్పటి ప్రతిపక్షమైన వైసిపి నేతలపై కేసులు పెట్టించటం, అరెస్టులు చేయించటం చాలానే చేశారు. అదే సందర్భంలో తన సంపాదనకు అడ్డు వస్తున్నారన్న కారణంతో మామూలు జనాలపైన కూడా దౌర్జన్యాలు చేయించి కేసులు పెట్టించారు.

సూరి అరాచకాలతో విసిగిపోయిన  జనాలు మొన్నటి ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి కేతిరెడ్డి వెంకట్రారెడ్డిని మంచి మెజారిటితో గెలిపించారు. ఎప్పుడైతే వైసిపి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండే సూరిని కేసుల భయం వెన్నాడుతోంది. అధికారంలో ఉండగా తాను సాగించిన అరచకాలకు ఇపుడు మూల్యం చెల్లించుకోవాల్సొస్తుందని భయపడుతున్నారు.

కేవలం కేసుల నుండి రక్షణకోసమే సూరి బిజెపిలో చేరిపోయారు. టిడిపిలో ఉంటే లాభం లేదని అనుకున్న మాజీ ఎంఎల్ఏ వేరే దారిలేకే బిజెపిలో చేరారన్నది వాస్తవం. సూరి దారిలోనే ఇంకా జిల్లాలోని చాలామంది నేతలు బిజెపిలో  చేరటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. పెనుకొండ, రాప్తాడు, పుట్టపర్తి, అనంతపురం, తాడిపత్రి నియోజకవర్గాల్లోని నేతలు కూడా బిజెపిలో చేరటానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు.