చింతమనేని అరెస్టు

పరారీలో ఉన్న తెలుగుదేశంపార్టీ నేతల్లో ఒకరైన చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ వేధింపుల ఫిర్యాదు అందింది. దాని సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని చింతమనేనిని విచారణకు పిలిచారు. ఎప్పుడైతే తనపై ఎస్సీ వేధింపుల కేసు నమోదైందని తెలుసుకున్నారో అప్పటి నుండే చింతమనేని పరారీలో ఉన్నారు.

దాదాపు 15 రోజులు అజ్ఞాతంలో గడిపిన మాజీ ఎంఎల్ఏ ఇక లాభం లేదనుకుని తిరిగి తన ఇంటికి వచ్చేశారు. ఆ విషయం తెలియగానే పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ అరెస్టు చేశారు. టిడిపి  ప్రభుత్వంలో ఉన్నపుడు తాను ఎంఎల్ఏగా ఉన్నంత కాలం చింతమనేని చేసిన అరాచకాలకు అంతే లేదు.

ఎప్పటికీ టిడిపినే అధికారంలో ఉంటుందని, తానే ఎంఎల్ఏగా శాస్వతంగా ఉంటాననే భ్రమల్లో చింతమనేని ఉండేవారు. ఎప్పుడైతే టిడిపితో పాటు తనకు కూడా మొన్నటి ఎన్నికల్లో జనాలు  మాడు పగలగొట్టారో అప్పటి నుండి చింతమనేనిలో కాస్త భయం మొదలైంది. అంటే మరి చేసిన పాపాలు ఊరికే పోతాయా. అయితే ముందు కాస్త భయపడ్డారు కానీ మళ్ళీ తన సహజ ధోరణిలోకి వెళ్ళిపోయి ఎస్సీలను పట్టుకుని తిట్టారు. దాంతో వాళ్ళు ఫిర్యాదు చేశారు.

పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎన్ని అరాచకాలకు పాల్పడ్డా ఎంతమంది ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు కట్టేవారు కాదు. దాంతో విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు చింతమనేని. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా అలాగే ఉంటానంటే ఎలా కుదురుతుంది ? దాని పర్యవసానమే ఈ అరెస్టు.