తెలుగుదేశంపార్టీలో మాజీ ఎంఎల్ఏ బోండా ఉమా మహేశ్వరరావు చిచ్చు పెట్టటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కొద్ది రోజులుగా బోండా పార్టీకి రాజీనామా చేసేస్తాడనే ప్రచారం ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల ఆస్ట్రేలియా పర్యటన తర్వాత విజయవాడకు బోండా తిరిగొచ్చారు. వెంటనే చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు.
భేటీ అయిన వెంటనే ఎవరితోను ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. దాంతో అందరిలోను గందరగోళం మరింత పెరిగిపోయింది. తర్వాతెప్పుడో తాను పార్టీ మారటం లేదని ప్రకటించారు. పార్టీ మారేవాడినైతే చంద్రబాబుతో ఎందుకు భేటీ అవుతానని బోండా వేసిన ప్రశ్న అర్ధం లేనిదే. ఎందుకంటే గతంలో కూడా కొందరు నేతలు చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
చంద్రబాబుతో భేటీ అయినంత మాత్రాన పార్టీ మారకూడదని ఎక్కడా లేదు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు బోండా దూరంగానే ఉంటున్నారు. దానికితోడు నెల రోజులు ఆస్ట్రేలియాలో పర్యటించిన బోండా అక్కడ టిడిపి అభిమానులకు కూడా దూరంగానే ఉన్నారు. బోండా వచ్చాడు కదా అని ఆత్మీయ సమావేశం పెట్టి ఆహ్వానిస్తే హాజరుకాకపోవటం ఇక్కడ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
మొత్తానికి బోండా విషయంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు మాత్రం పెరిగిపోతోంది. ఒకవైపు విజయవాడ ఎంపి కేశినేని నాని ట్వీట్లు, ఫెస్ బుక్ పోస్టులతో చంద్రబాబు అండ్ కో ను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. నానికి ఇపుడు బోండా కూడా తోడయ్యారంతే. మొత్తానికి టిడిపిలో బోండా చిచ్చు ఖాయమనే ప్రచారమైతే ఆగటం లేదు.