జనసేనకి టీడీపీ ఎందుకు ఖర్చు చెయ్యాలి.?

జనసేన పార్టీ కోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతోందన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ‘మన వైపు నుంచి స్నేహ హస్తం అందిస్తున్నాం.. వాళ్ళే స్పందించడంలేదు.! వన్ సైడ్ లవ్ వల్ల ప్రయోజనం వుండదు..’ అంటూ కొన్నాళ్ళ క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన గురించి చేసిన వ్యాఖ్యలతో మొదలైంది అసలు కథ.

ఎలాగైతేనేం, చంద్రబాబు కోరుకున్నట్లు టీడీపీతో జనసేన పొత్తు ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసి పోటీ చేయనున్నాయి. వైసీపీని దించెయ్యడమే లక్ష్యంగా ఈ పొత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనవంతుగా కష్టపడ్డారు. బీజేపీ కూడా ఈ కూటమిలోకి రావాల్సి వుందిగానీ, వచ్చేది అనుమానమే ప్రస్తుతానికి.

ఇదిలా వుంటే, జనసేన పార్టీ పోటీ చేయబోయే కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చుని టీడీపీ భరించేలా ఒప్పందాలు జరిగిపోయాయన్న ప్రచారం షురూ అయ్యింది. ఈ విషయమై తెలుగు తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారు.

‘మనమెందుకు జనసేన కోసం ఖర్చు చెయ్యాలి..’ అన్నది వారి ఆవేదన. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన గెలుపు కోసం టీడీపీనే ఒకింత ఎక్కువగా.. అంటే, ఆర్థికంగా ఖర్చు చేయాల్సి వుంటుంది. జనసేన వైపు నుంచి, టీడీపీకి పెద్దగా ఖర్చు వుండదు.. పవన్ కళ్యాణ్ ఛరిష్మా, టీడీపీకి ఉపయోగపడుతుందంతే.

రాజకీయాలన్నాక ఇలాంటివి మామూలే.! పొత్తు ధర్మం వెనుక ఆర్థిక ప్రయోజనాలు చాలానే వుంటాయ్. టీడీపీ – జనసేన పొత్తు విషయమై, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో లోతైన చర్చ జరుగుతుండడానికి కారణం, అక్కడి నుంచే జనసేనాని పోటీ చేస్తారనే ప్రచారమే.!