సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారమైనా సాధ్యమే. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు చాలామందే ఉంటారు. ఇన్నాళ్లు సెలబ్రిటీల వివాదాల వరకే పరిమితమైన సోషల్ మీడియా ఇప్పుడు రాజకీయ నాయకుల వరకు వెళ్ళిపోయింది. నమ్మలేని రీతిలో ఒకరి మీద ఒకరు పుకార్లు పుట్టించుకుంటూ రగడ రగడ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరి మీద ఒకరు వీలు చిక్కినప్పుడల్లా దాడికి దిగుతుంటారు. ఈ దాడులు సరైన, అవసరమైన విషయాల్లో జరిగితే బాగానే ఉంటుంది. కానీ అనవసరమైన విషయాలు, అసత్యపు ప్రచారాలు ఎక్కువయ్యాయి. ఒక పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ నాయకులను ఎలాగైనా భ్రష్టు పట్టించాలని లక్ష్యంతో కొత్త కొత్త వివాదాలకు తెరకెలేపుతున్నారు.
తాజాగా టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మీద వైసీపీ సోషల్ మీడియా బృందాలు కొత్త ప్రచారం షురూ చేశాయి. బొండా ఉమా ఒక హీరోయిన్ తో కలిసి హోటల్ నుండి బయటికి వస్తున్నారని అంటూ ఏవో ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులెవరో కూడ సరిగ్గా కనిపించట్లేదు. కానీ అందులో ఒకరు బొండా ఉమా అని, ఆయన పక్కన హీరోయిన్ ఉందని ఊదరగొట్టారు. ఇక ఇలాంటి విషయాలు ఎంతవరకు వెళతాయో అందరికీ తెలిసిందే కదా. ఆ ఫోటో పట్టుకుని బొండా ఉమా మీద చిలువలు పలువలుగా పుకార్లు పుట్టించేశారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీల మధ్యన సోషల్ మీడియాలో వార్ ఓ స్థాయిలో జరిగింది.
దీంతో ఉమా రంగంలోకి దిగి పంచాయతీని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. ఫేక్ ఫోటోలు పెట్టి తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారని, అసలు ఆ హీరోయిన్ ఎవరో కూడ తనకు తెలియదని, వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారంతో తన మీద లేనిపోని అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉందని, ఇది వైసీపీ కుట్రని అంటూ హైదరాబాద్ పోలీసులకు పిర్యాధు చేశారు. ‘తప్పుడు ఆరోపణలు చేయటం కాదు రా జఫ్ఫా పెటియం బ్యాచ్. దమ్ముగా పోలీస్ కంప్లయింట్ ఇచ్చా. జైలుకు వెళ్ళటానికి సిద్దంగా ఉండండి. మీ నాయకుడి ఫేవరేట్ జైల్ చంచల్ గూడా జైల్. మేనేజ్ చేయటానికి ఏపీ పోలీసులు కాదు’ అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్ఛేశారు.