బేరాల్లేవంటున్న బాబు… పవన్ డూడూ బసవన్నే!

కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలేండర్ దొరికినట్లు.. ఎడారిలో మినరల్ వాటర్ అందినట్లు.. మండుటెండల్లో చిరుజల్లులు కురిసినట్లు.. తెగ మురిసిపోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు! పెద్దగా కష్టపడకుండానే వచ్చిన ఫలితంతో బాబు సంబరాలు చేసేసుకుంటున్నారు. తమ్ముళ్లూ.. రేపు అనేది మనకు మంచిగానే కనిపిస్తుంది.. ఆ విధంగా ముందుకెళ్తాం అంటూ సైకిల్ కి కూడా గెర్స్ ఫిట్ చేసే పనిలో ఉన్నారు బాబు. కేడర్ హ్యాపీ! కానీ.. జనసేన పరిస్థితే సందిగ్దంలో పడింది!

2019 ఎన్నికల ఫలితాలతో చావుతప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి టీడీపీది. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సేం సీన్ రిపీట్. ఏకగ్రీవాలు, వార్ వన్ సైడ్ లు అంటూ జగన్ ఊచకోతకోసుకుంటూ పోయారు. ఫలితంగా టీడీపీ పరిస్థితి వెంటిలేటర్ పైకి చేరింది. ఇక ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సేం సిట్యువేషన్. అలాంటి సమయంలో… టీడీపీకి సెలైన్ పెట్టి బ్రతికించేశాయి గ్రేడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.

దీంతో… బాబులో కొత్త ఉత్సాహం వచ్చిందంట. ఇక తగ్గేదేలే తమ్ముళ్లు… అంటూ బాబు ముందుకి కదులుతున్నారంట. ఎందుకంటే… ఇది పూర్తిగా టీడీపీ విజయం. జనసేన ప్రత్యక్షంగా మద్దతు పలకలేదు. కమ్యునిస్టులు మద్దతు పలికినా… గ్రేడ్యుయేట్లలో వారి స్థానం అతిస్వల్పం! ఆ లెక్కన చూసుకుంటే… ఇది పూర్తిగా టీడీపీ కి దక్కిన సోలో విక్టరీ అని బాబు భావిస్తున్నారు. ఇది కచ్చితంగా జనసేనకు బ్యాడ్ న్యూసే అంటున్నారు విశ్లేషకులు.

బాబు సంగతి తెలిసినవారు ఎవరైనా… ఓడ మల్లానా – ఓడి మల్లాన్నా సామెతను గుర్తుకు తెచ్చుకుంటారు! నిన్నటివరకూ జనాల్లో వేవ్ ఎలా ఉందో తెలియక పవన్ కూడా కలిస్తే బాగుంటుందని బాబు భావించారు. దాంతో… పవన్ కూడా కాస్త బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 20 – 25 సీట్లిస్తే కుదరదన్న సంకేతాలు పంపించారు. కానీ… ఇప్పుడు బాబుకు బలం వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకఓటుకు తానే సోలో ఓనర్ అనే భావన బలపడింది. దీంతో ఇప్పుడు పొత్తు బాలు… బాబు కోర్టుకు చేరింది.

ఇప్పుడు బాబు ఇచ్చినన్ని సీట్లు, ఇచ్చిన దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి జనసేనది. అలాకాదని అడ్డం తిరిగితే… ఇంతకాలం పవన్ ని సపోర్ట్ చేసిన బాబు అనుకూల మీడియా పవన్ ని టార్గెట్ చేస్తుంది. నిలకడలేని వాళ్లతో రాజకీయ కష్టమని బాబే పొత్తు వద్దన్నారని రాసేస్తుంది. దీంతో… ఇప్పుడు బాబు ఎస్ అంటే ఎస్.. నో అంటే నో!

అంతలా బూస్ట్ ఇచ్చిన గ్రేడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కనిపిస్తాయనేది బాబు నమ్మకం. మరి అది నమ్మకమా – భ్రమా అనే విషయం తెలియడానికి సమయం పడుతుంది కానీ… ప్రస్తుతం పొత్తు విషయంలో పవన్ కి మాత్రం డూడూ బసవన్న పరిస్థితే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి!