భయపడే విషయంలో తగ్గేదేలేదంటున్న బాబు!

పైకి ఎవరికీ కనిపించడం లేదులే అన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు కానీ… చంద్రబాబూకి భయం మామూలుగా ఉండదు.. టన్నుల్ టన్నుల్ ఉంటుంది! ఇప్పటికే ఆ విషయం ఎన్నోసార్లు నిరూపించుకున్న బాబు… తాజాగా విశాఖ కేంద్రంగా మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

బాబుకు భయం పుష్కలంగా ఉంది. ఆ భయం వల్లే ఓటుకు నోటు కేసు విషయంలో హైదరబాద్ ని అర్ధాంతరంగా ఖాళీ చేసేసి, కరకట్టకు వచ్చారని చెబుతుంటారు. ఆ భయం వల్ల నాడు భాగ్యనగరం దూరం అయ్యింది! అంటే బాబు భయానికి ప్రతిఫలంగా ఐదేళ్లు ఉమ్మడి రాజధానిని ఏపీ ప్రజలు వదులుకోవాల్సి వచ్చిందన్న మాట. ఇదే క్రమంలో తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో కూడా భయపడిపోతున్నారు బాబు! అది కూడా మామూలు భయం కాదు సుమా..?

తాజాగా ఉత్తరాంధ్ర జోనల్ సమావేశంలో పాల్గొనేందుకు వైజాగ్ వెళ్లిన చంద్రబాబును.. స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్లు కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో… యూనియన్ లీడర్లు చెప్పిందంతా విన్న చంద్రబాబు… అనంతరం మైకందుకుని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి చేతకానితనం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం అయిపోతోందంటు ఫైర్ అయిపోయారు. అధికారంలో ఉండి కూడా జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నట్లు రెచ్చిపోయారు.

దీంతో అవాక్కైన యూనియన్ లీడర్లు… మేము అడిగిందేమిటి, చెప్పిందేమిటి.. చంద్రబాబు ప్రసంగిస్తున్నదేమిటి.. అంటూ నిరాసపడిపోయారు. దీంతో స్పందించిన విశ్లేషకులు.. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ‌. తమ సంస్థ‌పై నిర్ణయం తీసుకునే హక్కు గురించి మీరు అడ్డుపడటం ఏమిటంటూ కేంద్రం ఫైరవుతుంది. అయినప్పటికీ ప్లాంట్‌ ను ప్రైవేటుపరం చేయొద్దని మోడీకి లేఖ రాసిన జగన్… ఒకవేళ అమ్మేయదలచుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికే అమ్మాలని కూడా అడిగారు. పార్లమెంటులో కూడా వైసీపీ ఎంపీలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు!

వాస్తవాలు ఇలా ఉంటే నరేంద్ర మోడీని తప్పుపట్టాల్సిన చంద్రబాబు మాత్రం పదే పదే జగన్‌ ను తప్పుపడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏమిటంటే… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం జరిగింది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. అవును… 2018లోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని దాచిపెట్టిన చంద్రబాబు… మొత్తం తప్పంతా జగన్‌ దే అంటూ విమర్శిస్తున్నారు.

సరే రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీ నేత కాబట్టి ఒక రాయి వేశారని అనుకున్న… అసలు అనాల్సిన మనిషిని ఒక్కమాటా అనడం లేదనేదే ఇక్కడ పాయింట్. కనీసంలో కనీసం మోడీ పేరు కూడా ప్రస్థావించలేని భయం బాబు సొంతం అయిపోయింది. బాబు చెబుతున్న అసత్యమే సత్యమని కాసేపు అనుకుంటే… జగన్ చేతకానితనం వల్ల ప్లాంట్ పోతుందని అనుకుంటే… పోగుడుతున్నవాళ్లను కనీసం క్వశ్చన్ చేయొద్దా? నో.. వే…! మాటవరసకైనా కూడా మోడీని తప్పుపట్టాలంటే… బాబు వల్ల కాదంతే…! బాబు ధైర్యం లెక్కే వేరు!!