ఎమ్మెల్యేల కొనుగోళ్ళు టీడీపీకి కొత్తేమీ కాదు. 2014 నుంచి 2019 వరకూ వైసీపీ ఎమ్మెల్యేలను చాలామందిని టీడీపీ కొనుగోలు చేసింది. దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో టీడీపీకి అమ్ముడుపోయారు. అబ్బే, మేం అమ్ముడుపోలేదు.. చంద్రబాబు పాలన పట్ల ఆకర్షితులమయ్యాం.. అని చెప్పుకున్నా, తెరవెనుకాల జరిగింది అమ్మకాలు, కొనుగోళ్ళ వ్యవహారమే.
మళ్ళీ ఇప్పుడు టీడీపీ ఆ కొనుగోళ్ళ వ్యవహారానికి తెరలేపినట్లు కనిపిస్తోంది. మొత్తం 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వున్నారని టీడీపీ నేతలంటున్నారు.. అదీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో. అంటే, అంతమందినీ టీడీపీ గంపగుత్తగా కొనేసిందన్నమాట.
మరి, వైసీపీ వైపు వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యేల సంగతేంటి.? వాళ్ళూ అమ్ముడుపోయారా.? అంటే, రాజకీయమంటేనే అంత.! అమ్మకాలు, కొనుగోళ్ళు తప్ప, రాజకీయంలో ఇంకేముంటుంది.! అలా తగలడింది రాజకీయ వ్యవస్థ.
కాకపోతే, వైసీపీ నిజంగా కొనేయాలనుకుంటే, టీడీపీలో చంద్రబాబు తప్ప ఇంకో ఎమ్మెల్యే మిగలడం కష్టం. ఈ విషయంలో టీడీపీ పట్ల వైసీపీ కొంత జాలి ప్రదర్శించినట్లుంది. ఆ సంగతి పక్కన పెడితే, ఒక్క సీటు గెలిచే అవకాశం టీడీపీకి వున్నా.. అది కనాకష్టమే. మొత్తంగా ఏడింటినీ గెలిచేస్తామని వైసీపీ అంటోంది.
వైసీపీ నుంచి టీడీపీకి కొందరు మద్దతిస్తే తమ అభ్యర్థి గెలుస్తారని టీడీపీ అంటోంది. అంతా కొనుగోళ్ళ మహిమ.!