‘బింబిసార’ సక్సెస్ వెనుక తెలుగుదేశం పార్టీ.?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ సినిమాని తెలుగుదేశం పార్టీ భుజానికెత్తుకోవడం తెలిసిన విషయమే. రిపీటెడ్ ఆడియన్స్ థియేటర్లకు రావడం వెనుక తెలుగుదేశం పార్టీ అనుసరించిన వ్యూహం సుస్పష్టం. టీడీపీ ఎమ్మెల్యే కూడా కావడంతో నందమూరి బాలకృష్ణ సినిమాని టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది.

మరీ ముఖ్యంగా విదేశాల్లో.. అందునా, అమెరికాలో ‘అఖండ’ సినిమా కోసం టీడీపీ చాలానే ఖర్చు చేసింది. నేరుగా టీడీపీ రంగంలోకి దిగలేదుగానీ, టీడీపీ మద్దతుదారులైన ఓ సామాజిక వర్గం ‘అఖండ’ సినిమాని మేగ్జిమమ్ తమ భుజాన వేసుకుంది. సరే, సినిమాలో కంటెంట్ కూడా వుందన్న విషయాన్ని కాదనలేమనుకోండి.. అది వేరే సంగతి.

‘ఆచార్య’ సినిమాని టీడీపీ అలాగే వైసీపీ.. రెండూ కలిసి తొక్కేయాన్న విమర్శ లేకపోలేదు. సినిమాలకీ, రాజకీయాలకీ విడదీయలేని సంబంధం ఏర్పడిపోయింది ఇటీవలి కాలంలో. ఓ రాజకీయ పార్టీ ఓ సినిమాని తొక్కేయగలదా.? ఓ సినిమాని హిట్ చేయగలదా.? అంటే, దానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలుంటాయ్.!

‘బింబిసార’ సినిమా విజయాన్ని అందుకుంది. ఈ విజయం వెనుక టీడీపీ వున్న విషయాన్ని కాదనలేం. టీడీపీ తరఫున సోషల్ మీడియాలో పని చేసే పలు హ్యాండిళ్ళు ‘బింబిసార’ హ్యష్‌ట్యాగ్‌తో రోజూ వందల కొద్దీ, వేల కొద్దీ ట్వీట్లేస్తున్నాయి. అంతేనా, ‘మెగాస్టార్ కళ్యాణ్‌రామ్’ అనే హ్యాష్‌ట్యాగ్స్‌ని ప్రచారం చేస్తున్నది కూడా ఆ సోషల్ మీడియా హ్యాండిళ్ళే కావడం గమనార్హం.

చిత్రమేంటంటే, ఈ హ్యాండిళ్ళే యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద విపరీతమైన ట్రోలింగ్ చేశాయి గతంలో. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి ఎన్టీయార్ మీద మేగ్జిమమ్ ఏడ్చింది కూడా వీళ్ళే కావడం గమనార్హం. ‘బింబిసార’ కేవలం టీడీపీ వల్ల సక్సెస్ అయ్యిందని అనలేం. కానీ, టీడీపీ కూడా ‘బింబిసార’ సక్సెస్ కోసం తనవంతు ‘కష్ట’పడిందన్నది నిర్వివాదాంశం.