జనసేనకు టీడీపీ మార్కు వెన్నుపోటు.! లాగేస్తున్నారహో.!

జనసేన పార్టీకి తెలుగు దేశం పార్టీ వెన్నుపోటు పొడుస్తుందనే ఖచ్చితమైన అభిప్రాయం జనసేన శ్రేణుల్లో మొదటి నుంచీ వుంది. అయితే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అన్న ఆలోచనతో, జనసేనాని పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గౌరవ ప్రదమైన సీట్లు గెలిచే క్రమంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు.

నిజానికి, జనసేనాని వ్యూహం ఫలించింది. అంచనాలకు మించి జనసేన పార్టీ, ఎన్నికల ముందర హైప్ సాధించగలుగుతోంది. కీలక నేతలు, టీడీపీ కంటే కూడా జనసేన బెటర్ అన్న ఆలోచనతో జనసేన వైపు వెళుతున్నారు. వైసీపీ నుంచి ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిథులు బెస్ట్ ఆప్షన్‌గా జనసేనని చూస్తున్నారు.

అయితే, ఇక్కడే జనసేనకి టీడీపీ నుంచి వెన్నుపోట్లు ఎదురవుతున్నాయి. ఓ వైసీపీ ఎంపీ, జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా, తెరవెనుక టీడీపీ చక్రం తిప్పడంతో ఆ ఎంపీ, జనసేనను కాదని టీడీపీలోకి చేరేందుకు తయారయ్యారట. అయితే, చివరి నిమిషం వరకు ఆయన ఏ పార్టీలో చేరతారన్నదానిపై గందరగోళం కొనసాగే అవకాశముంది.

సదరు ఎంపీ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ తీరుపై గుస్సా అవుతున్నట్లు తెలుస్తోంది. ‘మీరు జనసేనలోకి వెళ్ళినా, ఆ టిక్కెట్టుని డిసైడ్ చేసేది టీడీపీ..’ అంటూ టీడీపీ ముఖ్య నేత ఒకరు, సదరు వైసీపీ ఎంపీ దగ్గర చెప్పిన విషయం, జనసేన అధినేత వద్దకు చేరినట్లు తెలుస్తోంది.

వైసీపీ నుంచి వల్లభనేని బాలశౌరి తాను జనసేనలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. మరో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వైసీపీని వీడటం ఖాయమైంది. ఆయన టీడీపీతో టచ్‌లో వున్నారు. జనసేనతోనూ టచ్‌లో వున్నారాయన. అంటే, లావు శ్రీకృష్ణదేవరాయుల్ని జనసేనలో చేరకుండా తనవైపుకు టీడీపీ తిప్పుకుంటోందని అనుకోవాలా.? అంతేనేమో.!

ఇప్పుడే ఇలా వుంటే, ఎన్నికలయ్యాక టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు జనసేన ఇంకెంతలా విలవిల్లాడుతుందో.!