ఈ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ లో అచ్చెన్న అరంగేట్రంపై కొత్త చర్చ!

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పరిపూర్ణమైన గందరగోళంతో నడుస్తున్నాయి. ఎవరికి ఎవరు మిత్రుడో, ఎవరికి ఎవరు శత్రువో తెలియని అయోమయ పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. సాధారణంగా ఇంతకాలం ఇలానే ఉన్నప్పటికీ అవి తెరవెనుక సాగుతుండేవి. తాజాగా ఏపీలో బీజేపీ పెద్దల సభలతో ఇవి కాస్త పూర్తిగా బహిరంగమైపోయాయి.

అవును… ఏపీలో బీజేపీ – టీడీపీ – జనసేన ల సంగతి కాసేపు పక్కనపెడితే.. రాబోయే ఎన్నికల్లో తాను ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. అయితే అదేదో ఇప్పుడు తాజాగా చేసిన ప్రకటన కాదు. గతంలో ఎప్పటినుంచో “సింగం సింగిల్ గా వస్తుంది” అంటూ తమ పార్టీ నాయకులతో సంకేతాలు ఇచ్చారు.

అంతవరకూ ఓకే కానీ… ఏపీలో ఎట్టిపరిస్థితుల్లోనూ 2014 ఎన్నికల పొత్తులతో వెళ్లాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేన అధినేత చెప్పుకొచ్చారు. ఒంటరిగా వెళ్తే వీరమరణమే అనే భయం సంగతి కాసేపు పక్కన పెడితే… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే ఆయన రాజకీయ ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. అయితే తాజాగా పొత్తులతో వెళ్తానో, ఒంటరిగా వెళ్తానో అనే డౌట్ ని జనాల్లోకి వదిలారు.

ఇక నిన్నమొన్నటివరకూ మోడీ – అమిత్ షా ల అప్పాయింట్ మెంట్ కోసం అహర్నిశలూ శ్రమించిన బాబు.. తాజాగా అనుకున్నది సాధించారు. అమిత్ షా ని కలిశారు. అయితే ఆ భేటీలో ఏమి జరిగిందనేది ఇప్పటికీ గండికోట రహస్యం గానే ఉంది. ఈ భేటీలో ఏమి తేలిందనేది ప్రజలకు చెప్పే విషయంలో బీజేపీ – టీడీపీ రెండు పార్టీలు ధైర్యం చేయలేకపోతున్నాయి! వారి అస్పష్టతకు వ్యూహం అని పేరు పెట్టుకుంటున్నాయి!

అయినా కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి వెళ్లాలని అటు పవన్ , ఇటు చంద్రబాబు బలంగా భావిస్తున్నారని కథనాలొస్తున్న వేళ… అచ్చెన్న మైకులముందుకు వచ్చారు. చంద్రబాబు ఇచ్చిన స్వేఛ్చతో సొంతంగా ప్రకటించారో.. లేక, బాబు అనుమతి తీసుకునే అన్నారో తెలియదు కానీ… ఏపీలో బీజేపీ, వైసీపికి చాలా సాయం చేస్తుందని.. ఆ రెండూ ఒకటే అనే టైపు కామెంట్లు చేశారు.

అవును… బీజేపీతో వైసీపీకి సత్సంబంధాలున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీంతో… ఈ రచ్చ మధ్య దూరడం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు తమ్ముళ్లు! చంద్రబాబు, అచ్చెన్నకు అధిక స్వాతంత్రం ఇచ్చారంటూ ఆన్ లైన్ వేదికగా స్పందిస్తున్నారు. కారణం… పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే వరకూ విపక్షాలన్నీ ప్రభుత్వంపై దాడి చేయాలే తప్ప… వారిలో వారు చేసుకోకూడదని బాబు – పవన్ లు బలంగా నమ్ముతుంటారు.

కానీ… వారి ఇద్దరి వ్యూహానికీ అచ్చెన్న గండి కొట్టినట్లు అయ్యిందనేది పలువురు టీడీపీ నేతల అభిప్రాయంగా ఉంది. జగన్ కు కేంద్రంలో మోడీ సహాయం ఉంటే ఫ్యూచర్ లో తనకు ఫ్యూచర్ ఉండదని బాబు భయపడి బీజేపీ పొత్తు కోరుకుంటున్నారు కానీ… ఏపీలో బీజేపీకేదో బలమైన ఓటు బ్యాంకు ఉండి కాదన్న విషయం గ్రహించడంలో అచ్చెన్న ఫెయిలయ్యారా.. లేక, ఇది అచ్చెన్నా మార్కు వ్యూహమా అనేది తెలియాల్సి ఉంది!!