నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు బహిరంగ సభ కారణంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ పెద్ద మనసు చాటుకుందా.? తొలుత 10 లక్షల ఆర్థిక సాయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ పరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, ఆ మొత్తం ఇప్పుడు 23 లక్షలకు చేరింది. పార్టీ తరఫున 15 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు బాధిత కుటుంబాలకు. దానికి అదనంగా 8 లక్షల రూపాయల్ని, పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రకటించిన ఆర్థిక సాయంగా అందించబోతున్నారు.
అంటే, మొత్తంగా ఒక్కో బాదిత కుటుంబానికీ 23 లక్షల చొప్పున ఆర్థిక సాయం తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకుల నుంచి అందనుందన్నమాట. ఈ మొత్తానికి సంబంధించిన సొమ్ముని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బాధిత కుటుంబాలకు స్వయంగా అందజేస్తారట.
ఆర్థిక సాయం సరే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు చేపడుతుందన్నదే కీలకం ఇక్కడ. టీడీపీ అనే కాదు, అన్ని రాజకీయ పార్టీలూ ఈ విషయమై అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ త్వరలో ‘యువగళం’ పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఆ యాత్రకు సంబంధించి నిన్ననే టీడీపీ నుంచి ప్రకటన వచ్చింది. ఇంతలోనే ఈ తొక్కిసలాట ఘటన టీడీపీకి షాక్ ఇవ్వడం గమనార్హం.