ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందనే మాటలు వినిపిస్తున్నప్పటికీ రాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారిపోతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అనంతరం పవన్ ప్రకటించిన టీడీపీతో పొత్తు కచ్చితంగా కీలకమైందనే చెప్పాలి. వైసీపీ నేతల దృష్టిలో ఇదేమీ కొత్త విషయం కానప్పటికీ.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటున్న జనసేన ఇలా ఏపీలో మాత్రమే టీడీపీతో పొత్తు ప్రకటించడం కచ్చితంగా రాజకీయంగా ఆసక్తికరమైన అంశమనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు తర్వాత ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ రాజమండ్రిలో తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరుపార్టీల తరుపునా ఏడూగురేసి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అత్యంత కీలకంగా ఉమ్మడి మ్యానిఫెస్టోపై క్లారిటీ వచ్చింది. అందులో భాగంగా… నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు.
అయితే ఇప్పటికే 6 అంశాలతో రాజమండ్రిలో జరిగిన మహానాడులో మినీ మానిఫెస్టోను ప్రకటించింది టీడీపీ. అయితే… వైసీపీ నవర్త్నాలను, కర్నాటక ఎన్నికల్లో ఫేమస్ అయిన పథకాలనూ సమీకరించి, క్రోడీకరించి ఈ గ్యారెంటీ పథకాలను ప్రవేశ పెట్టారని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో జనసేన కూడా మేనిఫెస్టో సిద్ధం చేసుకుందని చెబుతున్నారు. దీంతో… ఇప్పుడు జనసేన మేనిఫెస్టోలో ఏయే అంశాలను ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరుస్తారనేది ఈఅసక్తిగా మారింది.
అయితే… మహానాడులో టీడీపీ ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ప్రకటించిన నేపథ్యంలో.. వాటికి తోడు జనసేన నుంచి మరో నాలుగు గ్యారెంటీలు కలిపి.. 10 గ్యారెంటీ పథకాలతో మినీ మేనిఫెస్టోను రూపిందించబోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రతిపాదించే నాలుగు గ్యారంటీలలో… భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన హామీతో పాటు యువతకు తెలంగాణలోని దళితబంధు తరహాలో ఒక హామీ, రైతులకు మరో హామీ, సబ్ ప్లాన్ నిధుల అంశంపై ఒకహామీ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
అనంతరం అనంతరం నవంబర్ 1 నుంచే 100 రోజుల పాటు ఈ మ్యానిఫెస్టో హామీల్ని జనంలోకి తీసుకెళ్లాలని.. అందుకు వీలుగా ఇరు పార్టీల నాయకులు, క్యాడర్ ఇంటింటికీ వెళ్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో రెగ్యులర్ గా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారని అంటున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ తేదీని బట్టి మెయిన్ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తుంది.
ఏది ఏమైనా… టీడీపీ – జనసేనల పొత్తు ప్రకటన అనంతరం రాబోతున్న ఈ కీలక మేనిఫెస్టో నవంబర్ 1 న ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందనేది వేచి చూడాలి. ఇదే సమయంలో ఈ పది గ్యారెంటీలతో 160 సీట్లలో గెలవాలనే లక్ష్యంతో ఈ రెండు పార్టీలూ ముందుకు వెళ్తాయని చెబుతున్నారు. వైనాట్ 160 అన్నమాట. ఏదీ ఏమైనా… ఈ రెండు పార్టీలూ ప్రకటించబోయే ఉమ్మడి మ్యానిఫెస్టోపై రాజకీయంగా తీవ్ర ఆసక్తి మాత్రం నెలకొందనే చెప్పాలి!