డేంజర్ బెల్స్… జనసైనికులను తమ్ముళ్లు అలా చూస్తున్నారా?

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో… ఏపీలో రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా టీడీపీ – జనసేన పొత్తుపై అటు రాజకీయ వర్గాల్లోనూ.. ఇటు సామాన్య ప్రజానికంలోనూ జరుగుతున్న చర్చ మరింత ఆసక్తిగా ఉంటుంది. ప్రధానంగా సీట్ల స్పర్ధుబాటు, సీఎం పీటంపై జరుగుతున్న చర్చ ఇంకాస్త ఆసక్తికరంగా మారింది. తనకు అంత అనుభవం లేదు, అందుకు చాలా అనుభవం ఉండాలి.. అంటూ సీఎం సీటును చంద్రబాబుకే వదిలేసినట్లుగా వ్యాఖ్యానించారు!

అయితే… అది జనసైనికులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనేది తెలిసిన విషయమే. అయితే ఈ విషయంలో వారి అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పలేని పరిస్థితి! ఈ సమయంలో హరిరామ జోగయ్య రూపంలో జనసైనికుల అభిప్రాయాలను అక్షరాలుగా మార్చి పవన్ కు బహిరంగ లేఖలు రాశారు జోగయ్య. ఇందులో భాగంగా.. 60 సీట్లకు తగ్గకూడదని ఒక కండిషన్ అయితే… రెండున్నరేళ్లు సీఎం కుర్చీ షేర్ చేసుకోవాలనేది మరో కండిషన్.

అయితే… ఈ రెండు కండిషన్స్ కీ టీడీపీ ఒప్పుకునే సమస్యే లేదనేది ఇక్కడ ప్రధాన చర్చ. సీట్ల విషయంలోనూ, సీఎం చైర్ విషయంలోనూ పవన్ కూడా అంత బలంగా పోరాడటం లేదనే కామెంట్లు ఆ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం సీటు షేరింగ్ విషయంలో తమ అభిప్రాయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పారు అన్నట్లుగా ఒక సంఘటన తాజాగా చంద్రబాబు సొంత జిల్లాలోనే చోటుచేసుకుందని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే… ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… “రా.. కదలిరా” పేరుతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోన్నారు. అయితే… చంద్రబాబు నిర్వహిస్తోన్న ఈ సభలు.. టీడీపీ – జనసేన మధ్య అంతర్గత కుమ్ములాటలను తెరపైకి తెస్తున్నాయని తెలుస్తుంది.

ఇందులో భాగంగా ప్రధానంగా సీట్ల సర్దుబాటు పై చర్చ జరుగుతుండగా.. మరోవైపు ప్రధానంగా… సీఎం నినాదంపై కొత్త రచ్చ మొదలైంది. ఫలితంగా… గ్రామస్థాయిలో కలిసి మెలిసి పని చేయాల్సిన ఈ రెండు పార్టీల కార్యకర్తలు కొట్లాటకు దిగుతున్నారు. సీఎం అనే నినాదం చంద్రబాబుకు మాత్రమే చేయాలని హుకుం జారీచేస్తున్నారు. దీంతో… తెలుగుదేశం పార్టీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం పట్ల జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు.

తాజాగా చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో అలాంటి వాతావరణమే ఏర్పడింది. ఇందులో భాగంగా… గంగాధర నెల్లూరులో చంద్రబాబు నిర్వహించిన “రా.. కదలిరా” బహిరంగ సభలో టీడీపీ – జనసేన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. నోటికీ, చేతులకూ కూడా పనిచేప్పారు. ఇందులో భాగంగా… ఒకరినొకరు దూషించుకున్నారు.. కర్రలతో దాడి చేసుకున్నారు. టీడీపీ జెండాలను కట్టిన కర్రలను చేతపట్టిన టీడీపీ కార్యకర్తలు… జనసైనికులను తరిమి తరిమి కొట్టడం కనిపించింది.

దీంతో… అసలు ఈ రచ్చ ఎందుకు జరిగింది అంటే… “పవన్ కల్యాణ్ సీఎం” అని నినాదం చేసినందుకే టీడీపీ కార్యకర్తలు జనసేన కేడర్ ను తరిమి తరిమి కొట్టారని చెబుతున్నారు. ఈ ఘర్షణ వల్ల సభ మొత్తం రసాభాసగా మారి.. రణరంగంగా కనిపించింది. దీంతో… ఈ విషయంపై ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే… స్పష్టమైన ప్రకటన అటు చంద్రబాబు – జనసేనల నుంచి రానిపక్షంలో చినికి చినికి గాలివానగా మారి.. మొదటికే మోసం తెచ్చే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు.