టీడీపీ – జనసేన 100 రోజుల కార్యాచరణ… ఉమ్మడి మ్యానిఫెస్టో డేట్ ఫిక్స్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ ములాకత్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం జైలు బయటకు వచ్చిన తర్వాత పొత్తు ప్రకటించారు. అలా పొత్తు ప్రకటించి నెల రోజులు దాటినా ఉమ్మడి కార్యచరణపై సైలంట్ గా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో… సోమవారం టీడీపీ – జనసేన రాజమండ్రిలో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాజమండ్రిలో టీడీపీ – జనసేనకు చెందిన 14 మంది నాయకులతో సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ భేటీలో జనసేన నుంచి పవన్, మనోహర్, కందుల దుర్గేష్, వి మహేందర్ రెడ్డి, గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పలవలసాల యశస్వినీ పాల్గొనగా… టీడీపీ నుంచి నారా లోకేష్, అచ్చెంనాయుడు, యనమల, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల స్వామ్య ఉన్నారు.

సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ భేటీ తర్వాత పవన్ కల్యాణ్, లోకేష్ లు మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా… రాష్ట్రంలో ఇరు పార్టీలపై వైసీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు పవన్. ఇదే సమయంలో… 2014లో తాను టీడీపీకి మద్దతిచ్చానని, రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలన్న లక్ష్యంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానై ఆయన గుర్తుచేశారు.

ఈ సందర్హంగా… వైసీపీకి, జగన్ కు తాను వ్యతిరేకం కాదని, వారి విధానాలకు మాత్రమే వ్యతిరేకమని సన్నాయి నొక్కులు నొక్కడం గమనార్హం! అనంతరం మైకందుకున్న లోకేష్… రాబోయే వంద రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించినట్లు నారా లోకేష్ తెలిపారు. ఈ క్రమంలో… నవంబర్ 1 నుంచి మ్యానిఫెస్టో రూపొందించుకుని ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుడతామని లోకేష్ తెలిపారు.

ఇదే సమయంలో… కరువు నేపథ్యంలో రైతులు నష్టపోతున్నందున ఇరు పార్టీల నేతలు క్షేత్రస్ధాయిలో పర్యటించి జాయింట్ యాక్షన్ కమిటీ నివేదిక ఇస్తారని అన్నారు. ఈ మీటింగ్ లో మూడు తీర్మానాలు చేశామని, చంద్రబాబు అక్రమ అరెస్టును నిరస్తూ ఓ తీర్మానం, అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడేందుకు పొత్తు పెట్టుకోవాలని, అన్ని వర్గాల్ని అభివృద్ధి చేసేలా మరో తీర్మానం చేశామని లోకేష్ చెప్పుకొచ్చారు.