మహా కూటమి లో సీట్ల సర్దుబాటు మరింత కొలిక్కి వచ్చింది. కూటమిలో కాంగ్రెస్, టిడిపి, తెలంగాణ జన సమితి హ్యాప్పీగానే ఉన్నాయి. కానీ కూటమి ఏర్పాటు చేసిన సిపిఐ మాత్రం ఆవేదనతో, ఆందోళనతో ఉంది. కారణమేంటే ఆ పార్టీ 5 సీట్లు అడుగుతుంటే 3 మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ తేల్చి పారేశింది. దీంతో వారు కూటమిలో ఉంటారా లేదా అన్న టెన్షన్ నెలకొన్నది.
ఈ నేపథ్యంలో టిడిపికి 14 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అందులో ఇప్పుట ివరకు అందుతున్న సమాచారం మేరకు 11 సీట్లు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మరో మూడు సీట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. అయితే కూటమి సమీకరణాల నేపథ్యంలో మూడు పార్టీలు కలిపి బిసి నేతలను పాతాలానికి తొక్కేసినట్లే కనబడుతున్నది. ఎక్కడైతే బిసి నేతలు సీటును ఆశిస్తున్నారో అదే చోట ఇతర పార్టీల్లోని అగ్రవర్ణ నేతలు ఆ సీటును తన్నుకుపోయిన పరిస్థితి కనబడుతున్నది.
శేరిలింగంపల్లి సీటును అక్కడ కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ ఎమ్మెల్యేగా ఉన్న భిక్షపతి యాదవ్ ఆశిస్తున్నారు. కానీ ఆయనకు సీటు లేదని తేల్చినట్లు తెలుస్తోంది. ఆయన తనకు సీటు ఇవ్వాల్సిందే అని గాంధీభవన్ వద్ద తొలుత ధర్నా చేశారు. కూటమిలో త్యాగం చేయాలంటే బిసిలే దొరికిర్రా అని ఆయన కాంగ్రెస్ పెద్ద లీడర్లను ప్రశ్నించారు. దీంతో ఆయనకు ఎలాగైనా సీటు వస్తుందని, మధుయాష్కీ నచ్చచెప్పారు.
కానీ కూటమిలో భాగంగా ఆ సీటును టిడిపి తీసుకున్నట్లు తెలుస్తోంది. టిడిపి తరుపున ఇద్దరు కీలక నేతల పేర్లు ఉన్నాయి. వారిలో ఒకరికి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఇక మరో బిసి నేతకు సైతం కూటమిలో గట్టి పొగ తాకింది. ఉమ్మడి రాష్ట్రంలోనే పిసిసి అధ్యక్షులు గా పనిచేసి, మంత్రి గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు కూటమి షాక్ ఇచ్చింది. ఆయన స్థానంలో తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ను పోటీకి దింపబోతున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి.
తాజా సమాచారం ప్రకారం టిడిపి పోటీ చేయబోతున్న స్థానాలు, అభ్యర్థుల వివరాలు చదవండి.
ఈ 11 సీట్లలో కుదిరిన కూటమి
1 వరంగల్ ఈస్ట్ – రేవూరి ప్రకాశ్ రెడ్డి
2 సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య
3 ఉప్పల్ వీరేందర్ గౌడ్
4 అశ్వరావుపేట – మచ్చా నాగేశ్వర రావు
5 మక్తల్ – కొత్తకోట దయాకర్ రెడ్డి
6 ఖమ్మం – నామా నాగేశ్వర రావు
7 మహబూబ్ నగర్ – ఎర్ర శేఖర్
8 నకిరేకల్ – పాల్వాయి రజని కుమారి
9 నిజామాబాద్ రూరల్ – మండవ వెంకటేశ్వరరావు
10 శేర్ లింగంపల్లి – భవ్య ఆనంద ప్రసాద్
11 కూకట్ పల్లి – ఈ పెద్దిరెడ్డి లేదా మందాడి శ్రీనివాసరావు
పెండింగ్ లో ఉన్న సీట్ల వివరాలు
1 ఖైరతాబాద్
2 జూబ్లీహిల్స్
3 ఎల్ బి నగర్
పై మూడు స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మూడు సీట్లను కూడా టిడిపి కోరుతున్నది. కానీ వీటిై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఎల్బీ నగర్ గతంలో టిడిపి సీటు కావడంతో ఆ సీటును తిరిగి తమకే ఇవ్వాలని టిడిపి పట్టుబడుతున్నది. గతంలో మూడో స్థానానికి పరిమితమైన సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం సరికాదని టిడిపి వాదిస్తున్నది. అలాగే జూబ్లీహిల్స్ సీటును సైతం టిడిపి కోరుతున్నది. ఇక్కడ మహిళా నాయకురాలు ఉప్పలపాటి అనూష రాం, ప్రదీప్ చౌదరి సీటును ఆశిస్తున్నారు.
మొత్తానికి కూటమిలో జన సమితి సీట్లు కొలిక్కి వచ్చాయి. టిడిపి సీట్లు కూడా కొలిక్కి రాబోతున్నాయి. ఇక సిపిఐ ని ఒంటరి చేసి కూటమి నుంచి వెళ్లగొట్టే అవకాశాలే ఉన్నట్లు ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు.