టార్గెట్ చిరంజీవి.! నీకెందుకయ్యా.!

మెగాస్టార్ చిరంజీవి కూడా టార్గెట్ అయిపోయారు వైసీపీ శ్రేణులకి.! సినిమా తారల రెమ్యునరేషన్ల విషయమై జరుగుతున్న రాజకీయ రచ్చపై చిరంజీవి స్పందించడమే అందుక్కారణం.

ఇటీవల రాజ్యసభలో సినిమా సంబంధిత అంశాలపై చర్చ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, సినిమా నిర్మాణంలో స్టార్ల రెమ్యునరేషన్లే సింహ భాగమనీ, తద్వారా సినిమా క్వాలిటీ తగ్గుతోందనీ, దీనిపై రెగ్యులేషన్ అవసరమనీ వ్యాఖ్యానించారు.

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసీపీకి వున్న రాజకీయ వైరం నేపథ్యంలోనే, ఈ వివాదాన్ని వైసీపీ తెరపైకి తెస్తోంది. రాజ్యసభలో సల్మాన్ ఖాన్ ప్రస్తావన తెచ్చినా, అసలు విషయం పవన్ కళ్యాణ్ మీద అక్కసు.!

నిజానికి, ఈ రెమ్యునరేషన్ల సమస్యపై అన్ని సినీ పరిశ్రమల్లోనూ కొంత గందరగోళం వుంది. నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలి.. నటీనటులు రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలన్న డిమాండ్ ఈనాటిది కాదు.

అయితే, సినిమా అనేది కమర్షియల్ లెక్కలకు సంబంధించిన వ్యవహారం. ఇది కళాత్మకమైన వ్యాపారం. రాత్రికి రాత్రి హీరోల రెమ్యునరేషన్లు కోట్లకు పడగలెత్తేస్తాయ్. అదే సినీ మ్యాజిక్కు. అగ్ర హీరోలకు 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ పలుకుతోంది కూడా.!

చిన్నా చితకా నటీనటులే, స్టార్‌డమ్ దక్కించుకుంటే కోటికి పైన అడుగుతున్నారాయె. నిర్మాతలకు అది కష్టంగా మారుతున్నా, వచ్చే లాభాలను దృష్టిలో పెట్టకుని, ‘సరే’ అనక తప్పడంలేదు. అయినా, చిరంజీవి ఎందుకు రాజకీయ విమర్శలు చేసినట్లు.? ‘ప్రత్యేక హోదా వంటి అంశాల గురించి మాట్లాడాలిగానీ, రెమ్యునరేషన్ల గొడవ మీకెందుకు.?’ అని చిరంజీవి అనడం వల్ల ఒరిగేదేంటి.?

చిరంజీవి టార్గెట్ అయ్యారు. ‘భోళా శంకర్’ సినిమాకి ఏపీలో ఇక్కట్లు తప్పేలా లేవు. ఆ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించకుండా వుంటే, యూనివర్సల్‌గా కొట్టుకుపోయేది. తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం అన్నయ్య ఏమైనా రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారా.?